గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని బోయ కాలనీకి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలిని మూడు రోజుల క్రితం అనారోగ్యంతో గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె శుక్రవారం మరణించింది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కారణంగా ఆసుపత్రిలో మరణించిన వారికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వృద్ధురాలి మృతదేహానికి పరీక్షలు చేశారు. అయితే నివేదిక రావాల్సి ఉంది. అప్పటి వరకు మృతదేహాన్ని సత్తెనపల్లి ఆసుపత్రి మార్చురీలో ఉంచాలని సూచించారు. ఆ మేరకు వృద్ధురాలి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అంబులెన్స్‌లో సత్తెనపల్లి ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడి వైద్యులు మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీలో ఉంచేందుకు అంగీకరించలేదు.
మార్చురీ సమీపంలో పిల్లల వార్డు ఉందని సాకు చెప్పారు. దీంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు బంధువులు సిద్ధమయ్యారు. దానికి రెవెన్యూ, మున్సిపల్ అధికారులు అంగీకరించలేదు. జీజీహెచ్ నుంచి తెస్తున్నందున ఎక్కడ పడితే అక్కడకు మృతదేహాన్ని తీసుకెళ్లటానికి వీల్లేదని స్పష్టం చేశారు. దీంతో మృతదేహాన్ని అంబులెన్స్ లోనే ఉంచి అధికారుల నిర్ణయం కోసం కుటుంబ సభ్యులు గంటల తరబడి వేచిచూశారు.
ఇదీ చదవండి: 24 గంటల లైవ్ వర్కౌట్‌లో షట్లర్ పీవీ సింధు