Danda Nagendra Kumar in Police Custody: అమరావతిలో మాజీ వైసీపీ నేత దండా నాగేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై నాగేంద్ర జాతీయ హరిత ట్రిబ్యునల్లో కేసు దాఖలు చేశారు. ఆయన వేసిన పిటిషన్ విచారించిన తర్వాత ఇసుక తవ్వకాలు ఆపేయాలని హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు వచ్చిన కొద్దిరోజులకే నాగేంద్రపై ఎస్సీ అట్రాసిటి కేసు నమోదైంది. వైసీపీ కార్యకర్త చేసిన ఫిర్యాదు మేరకు అమరావతి పోలీసులు నాగేంద్రపై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో నాగేంద్ర బెయిల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే కేసులో నాగేంద్రను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
తన భర్తను బలవంతంగా పోలీసులు వాహనంలో తీసుకెళ్లడంతో అనూష మరో వాహనంలో పోలీసుల్ని అనుసరించారు. పెదకూరపాడు, సత్తెనపల్లి ఆ తరువాత రాజుపాలెం వైపు తీసుకెళ్తుండగా....అనూష పోలీసుల వాహనానికి అడ్డుపడ్డారు. తన భర్తను విడిచిపెట్టాలని పోలీసుల వాహనం ముందు బైఠాయించారు. తన భర్తను వదిలిపెడితేనే కానీ కదిలేది లేదని రోడ్డుపైన కూర్చున్నారు. తన భర్తకి ఏమైనా జరిగితే పల్నాడు ఎస్పీ, సత్తెనపల్లి డీఎస్పీ, అమరావతి సీఐదే బాధ్యత వహించాలన్నారు. అక్రమ ఇసుక తవ్వకాలపై పోరాటం చేస్తున్న కారణంగానే అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. కష్టపడి కట్టుకున్న గెస్ట్ హౌస్ కూల్చేస్తామని నోటీసులిచ్చారని, దాదాపు రెండు నెలలుగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, ఆయన కుమారుడి నుంచి తన భర్తకు ప్రాణహాని ఉందని ఆమె ఆరోపించారు.
Chandrababu on Nagendra Arrest: దండా నాగేంద్ర అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు, ప్రభుత్వ పెద్దల దోపిడీపై NGTలో కేసులు వేసినందుకే... అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపేనని మండిపడ్డారు. నాగేంద్ర కేసు కారణంగానే ఇసుక తవ్వకాలపై NGT చర్యలకు దిగి, తవ్వకాలు నిలిపివేసిందన్నారు. ప్రభుత్వం అక్రమ కేసులతో వేధించే చర్యలు మొదలు పెట్టిందని మండిపడ్డారు. ఇసుక అక్రమ తవ్వకాలతో సీఎం జగన్, వైసీపీ నేతలు 40 వేల కోట్లు దోచేసిన విషయం ఆధారాలతో బయటపెట్టామన్నారు. దానికి సమాధానం చెప్పకుండా అరెస్టులకు దిగడం నీతిమాలిన చర్య అని దుయ్యబట్టారు. నాగేంద్రను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
TDP Leaders Respond on Nagendra Incident: స్పందించిన టీడీపీ నేతలు... అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటీకి ఫిర్యాదు చేస్తే అక్రమ కేసులా... అని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లా ధరణికోటకు చెందిన దండా నాగేంద్రను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో రాజమండ్రిలో ఇసుక రవాణా అడ్డుకున్న దళిత యువకుడు వరప్రసాద్ కు శిరోముండనం చేశారని, ఇప్పుడు నాగేంద్రను అరెస్ట్ చేసి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సైకో జగన్ దుర్మార్గాన్ని అచ్చెన్న తీవ్రంగా ఖండించారు. నిబంధనలు పాటించకపోవడంతోనే ఎన్జీటీ 100 కోట్ల రూపాయలు జరిమానా విధించిందన్న అచ్చెన్న,.. ఇది ప్రభుత్వ సొమ్ముతో చెల్లిస్తారా లేక వైసీపీ నేతలు దోచుకున్న డబ్బుతో చెల్లిస్తారా అని ఎద్దేవా చేశారు. వైసీపీ తీరు మారకపోతే ప్రజలే ఇసుక డంపుల్లో వైసీపీని పాతి పెడతారని దుయ్యబట్టారు.
Harassment with Rebellion: తిరుగుబాటుతో వేధింపుల పర్వం.. ఇసుక తవ్వకాలకు సంబంధించి సమాచారాన్ని చంద్రబాబుకు అందించినట్లు ప్రభుత్వ పెద్దలకు తెలిసింది. దీంతో నాగేంద్రను పాత కేసులో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కొద్దిరోజుల క్రితం నాగేంద్రపై పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. అయితే ఆ విషయం బయటరు రానీయలేదు. హరిత ట్రిబ్యునల్ కేసు దాఖలు విషయంలో నాగేంద్రను ప్రోత్సహించిన కంచేటి సాయిని ఇప్పటికే పోలీసులు పీడీ యాక్ట్ కింద అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో ఉంచారు. ఇప్పుడు నాగేంద్రను అరెస్టు చేయటం చూస్తుంటే ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉన్నట్లు అర్థమవుతోంది.
రచ్చకెక్కిన ఇసుక దందా.. అధికారపార్టీ నేతల పరస్పర ఆరోపణలు.. కాకరేపుతున్న రాజకీయం
NGT with the Orders of MLA Shankar Rao : ఎమ్మెల్యే ఆదేశాలతోనే ఎన్జీటీకి: పల్నాడు జిల్లా ధరణికోటకు చెందిన వైసీపీ గతంలో వైసీపీ నాయకుడిగా చెలామణి అవుతూ వస్తున్నాడు. పెదకూరపాడు ఎమ్మెల్యే శంకరరావు అనుచరుడిగా ఉండేవాడు. ఎమ్మెల్యేతో వచ్చిన విభేదాల వల్ల వైసీపీకి దూరమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై.. గతంలో జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో పిటిషన్ వేశారు. దీనిని పరిశీలించిన ఎన్జీటీ( NGT) ఇసుక తవ్వకాలు ఆపాలని.. జరిమానాలు విధించింది. ఐతే, అప్పట్లో ఎమ్మెల్యే శంకర్రావు ఆదేశాలతోనే తాను ఎన్జీటీ ఆశ్రయించినట్లు నాగేంద్ర కుమార్ వెల్లడించారు. ఎమ్మెల్యేతో విభేదాల నేపథ్యంలో ఎమ్మెల్యేనే ఇసుక తవ్వకాలు చేస్తున్నారని.. తాను ఎన్జీటీలో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నారని నాగేంద్రకుమార్ ఆరోపించాడు. ఎమ్మెల్యే చెప్పినట్లు తన మాట వినలేదనే కక్షతో.. తనపై ఎస్సీ, ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టించారని నాగేంద్ర అప్పట్లో ఆరోపణలు చేశారు. తనకు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందని పేర్కొన్నారు.