వలసొచ్చిన ఓ వ్యాపారి సొమ్ముపై కన్నేశారు.. కలసి రోజు మద్యం తాగేలా పరిచయం పెంచుకున్నారు.. అవసరాలు తీర్చుకునేందుకు అతని హత్యకు ప్రణాళికేశారు.. పక్కాగా పని కానిచ్చేసి ఆధారాలు కనుమరుగు చేశారు.. గుర్తు తెలియని సగం కాలిన శవం ఆచూకీ కోసం రంగంలోకి దిగిన పోలీసులు నెలన్నరలో వాస్తవాలు వెలికి తీశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతానికి చెందిన కొనగల్ల శ్రీరంగనారాయణ (సరోజ బాబు) (62) అనే వ్యాపారి తన కుటుంబాన్ని వదిలేసి నాదెండ్లకు 30 ఏళ్ల క్రితం వలసొచ్చాడు. ఇక్కడే ఓ మహిళతో సహజీవనం సాగిస్తున్నాడు. కొవిడ్ కారణంగా అతను చేసే గ్రానైట్ వ్యాపారం ఆగిపోయింది. దీంతో తెలంగాణ నుంచి మద్యం తీసుకొచ్చి విక్రయిస్తున్నాడు. గతంలో ఎస్‌ఈబీ అధికారులు ఇతనిపై కేసు కూడా నమోదు చేశారు. అప్పుడప్పుడు స్థానికులతో కలసి సరదాగా మద్యం తాగుతుంటాడు.
దోచుకుని చంపేశారు..
నాదెండ్ల ఎస్సీ కాలనీకి చెందిన కొరివి అశోక్ (ఇసాక్) చోరీలకు పాల్పడుతుంటాడు. ఎనిమిది పోలీసు స్టేషన్ల పరిధిలో ఇతనిపై 15 దొంగతనాల కేసులున్నాయి. ప్రత్తిపాడు చోరీ కేసులో అరెస్టై జైలుకెళ్లొచ్చాడు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలు దెబ్బతింది. దీంతో అతను తన ప్రవృత్తిని కొనసాగించేందుకు వీలుపడలేదు. ఈ క్రమంలో తనతో కలసి మద్యం తాగే సరోజ బాబుపై కన్నేశాడు. అతను మే 6న రాత్రి ఎనిమిది గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై నాదెండ్ల - గణపవరం మధ్య తుర్లపాడు మేజరు కాలువకట్టపైకి వెళ్లడం గమనించాడు. మిత్రునితో కలిసి ఇతను కూడా మరొక ద్విచక్ర వాహనంపై సరోజబాబును అనుసరించారు. తాము కూడా మద్యం తాగుతామని నమ్మించి మత్తులో ఉన్న సరోజ బాబుపై పథకం ప్రకారం దాడిచేసి కాలువలోకి నెట్టారు. అతని చేతికున్న ఉంగరాలు, జేబులోని డబ్బు తీసుకున్నారు. విషయం బయటకు తెలిస్తే ఇబ్బందని భావించారు. అతని మర్మావయాలపై విచక్షణ రహితంగా కొట్టారు. గణపవరం దుకాణంలో కొనుగోలు చేసిన పెట్రోలు అపస్మారక స్థితిలో ఉన్న అతనిపై చల్లి నిప్పు పెట్టారు. అనంతరం దహనమవుతున్న శవాన్ని వదిలి పరారయ్యారు.
నేరస్థుడిని పట్టించిన ఆధార్‌కార్డు:
గొర్రెల కాపరులు పంట కాలువలో సగం కాలిన మృతదేహాన్ని గత నెల 8న గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. గ్రామీణ సీఐ సుబ్బారావు కేసు దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలంలో దొరికిన ఓ ఆధార్ కార్డుతో నేరస్థుడి ఆచూకీ తెలిసింది. నాదెండ్ల ఎస్సీ కాలనీకి చెందిన చోరుడు అశోక్‌పై నిఘాపెట్టారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. దోచుకున్న రూ.1.7లక్షల విలువైన సొత్తు (బంగారు ఉంగరాలు, ద్విచక్ర వాహనం) స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ నేరంలో పాలుపంచుకున్న ఒడిశాకు చెందిన అతని మిత్రుని కోసం గాలిస్తున్నారు. కేసు దర్యాప్తులో ప్రతిభచూపిన ఏఎస్సై రవిచంద్ర, సిబ్బంది వెంకట్రావు, వల్లభరావును పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.
ఇదీ చదవండి:
KARANAM MALLESWARI: దిల్లీ క్రీడా విశ్వవిద్యాలయం వీసీగా కరణం మల్లీశ్వరి