పోలవరం ప్రాజెక్జు బడ్జెట్ అంచనాల పెంపు పెద్ద మోసమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడగానే.. రివర్స్ టెండరింగ్ పేరుతో రూ. 795 కోట్ల వ్యయం తగ్గించారని చెప్పినట్లు గుర్తు చేశారు. అటువంటిది ఇప్పుడు బడ్జెట్ వ్యయం ఎలా పెంచారని ప్రశ్నించారు. దీనిపై ఇరిగేషన్ మంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాడు వందల కోట్ల అంచనాలు తగ్గించి.. నేడు వేల కోట్ల బడ్జెట్ అంచనాలు పెంచటంపై స్పష్టత ఇవ్వాలన్నారు. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కుట్రలో భాగమే...
గుంటూరు జిల్లా వినుకొండలోని ఆజాద్ నగర్ మసీద్ మాన్యంలో.. నివసిస్తున్న పేద కుటుంబాలను బాధపెట్టటం సరికాదని హితువు పలికారు. మసీదు మాన్యం భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించేందుకు.. కుట్రలో భాగంగా ఐదు వేల కుటుంబాలను ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇబ్బంది పెట్టడం దారుణమన్నారు.
నెల రోజులుగా ఆజాద్ నగర్ మసీద్ మాన్యంలో నివసిస్తున్న కుటుంబాలకు.. విద్యుత్, నీటి సరఫరా నిలిపివేశారు. వారి ఇబ్బందులను తెలుసుకున్న సీపీఐ రామకృష్ణ మసీదు మాన్యాన్ని సందర్శించారు. నెలరోజులుగా కరెంటు తాగునీరు నిలిపివేయటం వలన పిల్లలు, వృద్ధులు, గర్భిణీ మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేల కోట్ల ఆస్తి ఉన్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు.. పేదలు కడుపు కొట్టే ఆలోచన చేయటం సరికాదన్నారు.
మసీద్ మాన్యం ప్రజల సమస్యలపై కలెక్టర్ ఆదేశించినా.. మున్సిపల్ కమిషనర్ స్పందించకపోవటం దుర్మార్గమన్నారు. వినుకొండలో జరుగుతున్న అన్యాయంపై సీఎం జగన్కు లేఖ రాస్తానని అన్నారు. మసీద్ మాన్యం ప్రజలకు సీపీఐ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: అధికారుల కళ్లుగప్పి రెండు ఉద్యోగాలు..