CPI National Secretary Narayana Criticizes CM Jagan: రెండు తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ, బీఆర్ఎస్ ముసుగులో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వమే నడుస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బస్సు యాత్ర గుంటూరుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు సీపీఐ ఇతర నేతలు పాల్గొన్నారు.
బస్సుయాత్రలో భాగంగా గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో బహిరంగ సభ నిర్వహించారు. ప్రతిపక్ష హోదాలో వైసీపీని గెలిపించి అధికారం మా చేతికివ్వండి.. కేంద్ర మెడలు వంచుతానని జగన్మోహన్ రెడ్డి అన్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ గుర్తు చేశారు. కేసులకు భయపడి సీఎం జగన్ మోదీకి లొంగిపోయారని విమర్శించారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సీఎం జగన్ బెయిల్పై బయట తిరుగుతున్నారని అన్నారు.
పేరుకు వైసీపీ పార్టీ కానీ.. ముసుగులో బీజేపీనేనని ఆరోపించారు. మేకవన్నె పులిలాగా వీళ్లు కూడా బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని విమర్శించారు. పైకి మాత్రం వైసీపీ నాయకుల లాగా కనిపిస్తున్నారని.. అందుకే డబుల్ ఇంజిన్ అనేది ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందని నారాయణ అన్నారు.
CPI Bus Yatra Reached to Tulluru: "ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్ రెడ్డి ఓటమి ఖాయం"
వివేకా హత్య జరిగి నాలుగేళ్లు గడుస్తున్నా ఎటూ తేలలేదు: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు.. ఏ నిందితుడు ఇన్ని రోజులు బెయిల్పై బయట తిరగలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం దివాళా తీసిందని మండిపడ్డారు. వివేకా హత్య జరిగి నాలుగేళ్లు గడుస్తున్నా.. నేటికి ఆ కేసు తేలలేదని మండిపడ్డారు. పులివెందులకు వెళ్లి చిన్న పిల్లడ్ని అడిగినా హత్య చేసింది ఎవరనే విషయం చెబుతారని అన్నారు. మూడేళ్లు గడుస్తున్నా సీబీఐ విచారణ చేపట్టటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యనించారు. కడప జిల్లాలో ఏ వైసీపీ నాయకుడ్ని అడిగినా వివేకాను హత్య చేసింది ఎవరనే విషయం తెలుస్తుందని అసహనం వ్యక్తం చేశారు.
రాష్ట్ర అభివృద్ధిపై రామకృష్ణ: రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని మండిపడ్డారు. రాష్ట్రం అప్పులపాలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకి ముఖ్యమంత్రి సమావేశానికి కలెక్టర్ నిధులు ఇస్తున్నారంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర ఖాజానా దివాళా తీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే రాష్ట్రాన్ని రక్షించండి.. దేశాన్ని కాపాడండి అనే నినాదంతోనే ప్రజల్లోకి వెళ్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని, కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడుతాం అని ధీమా వ్యక్తం చేశారు.
"పేరుకు వైసీపీ పార్టీ కానీ.. ముసుగులో బీజేపీ పార్టీనే. మేకవన్నె పులిలాగా వీళ్లు కూడా బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. పైకి మాత్రం వైసీపీ నాయకుల లాగా కనిపిస్తున్నారు. కాబట్టి డబుల్ ఇంజిన్ అనేది ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది." -నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి
"రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయింది. రాష్ట్రం అప్పులపాలైపోయింది. చివరకి ముఖ్యమంత్రి సమావేశానికి కలెక్టర్ నిధులు ఇస్తున్నారంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ఖాజానా దివాళ తీసింది. అందుకే రాష్ట్రాన్ని రక్షించండి.. దేశాన్ని కాపాడండి అనే నినాదంతోనే ప్రజల్లోకి వెళ్తున్నాము. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని, కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడుతాం." -రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
CPI Ramakrishna comments on AP debts: రాష్ట్ర అప్పులపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోంది: రామకృష్ణ