వందల సంఖ్యలో కరోనా కేసులు, కోవిడ్ రోగులతో నిండిపోతున్న ఆసుపత్రులు... ఇది గుంటూరు జిల్లాలో పరిస్థితి. జిల్లాలో శుక్రవారం నాడు 703 పాజిటివ్ కేసులు వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఇందులో గుంటూరు నగరంలోనే 309 కేసులు వచ్చాయి. సత్తెనపల్లి 82, తెనాలి 73, మంగళగిరి 46, వినుకొండ 41, చిలకలూరిపేట 29, దాచేపల్లి 17, పొన్నూరు15, మాచర్ల13, తాడేపల్లి 13 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. పెదకాకాని 7, మేడికొండూరులో 6 కేసులు, బాపట్ల, ప్రత్తిపాడు, ముప్పాళ్ల, నాదెండ్ల, నర్సరావుపేటల్లో 5 చొప్పున, అమర్తలూరు, మాచవరం, శావల్యపురంలో 4 చొప్పున, పిడుగురాళ్ల, పెదకూరపాడులో 3 చొప్పున కేసులు వచ్చాయి. దుగ్గిరాల, కాకుమాను, చేబ్రోలు , కొల్లిపొర, క్రోసూరు, ఫిరంగిపురం, పిట్టలవానిపాలెం, రొంపిచెర్ల, రేపల్లెలో ఒక కేసు చొప్పున నమోదయ్యాయి. ఇప్పటి వరకూ జిల్లాలో కరోనా నుంచి కోలుకుని 4వేల 269 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 88మంది కరోనాతో మరణించినట్లు అధికారులు తెలిపారు.
జిల్లాలో కరోనా కేసులు ఉద్ధృతమవుతున్న దృష్ట్యా వైరస్ నివారణ చర్యలపై మంత్రి సుచరిత అధికారులతో సమావేశం నిర్వహించారు. పెరుగుతున్న కేసుల మేరకు ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెంచాలని ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం కోవిడ్ రోగుల కోసం 8 ప్రభుత్వ, 12 ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నామని... వాటిలో 3వేల 715 పడకలు ఉన్నట్లు మంత్రి తెలిపారు. అలాగే వ్యాధి తీవ్రత లేని వారి కోసం కోవిడ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని... అక్కడ 4,500 మందికి ఏర్పాట్లు ఉన్నాయని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకూ లక్షా 54 వేల పరీక్షలు నిర్వహించగా... 10 వేల 700 మందికి పాజిటివ్ గా తేలిందన్నారు.
కోవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు నిరాకరించే ఆసుపత్రులపై కఠిన చర్యలు తప్పవని... వాటి అనుమతి రద్దు చేస్తామని అధికారులు హెచ్ఛరించారు. గుంటూరు జిల్లాలో కోవిడ్ గురించి ఎలాంటి సహాయం కోసమైనా కాల్ సెంటర్ నంబర్ 0863-2241492 కు ఫోన్ చేయాలన్నారు. కరోనా నివారణ బాధ్యత ప్రజల చేతుల్లో ఉందని... అనవసరంగా బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.