గుంటూరు జిల్లాలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం కొత్తగా నమోదైన 9 కేసుల్లో తాడేపల్లిలో 2, తెనాలిలో 2 , హైదరాబాద్ నుంచి వచ్చిన ఇద్దరికి, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ నుంచి వచ్చిన ఒక్కొక్కరికి వైరస్ సోకింది. గుంటూరు, నరసరావుపేటలో కేసుల ఉద్ధృతి తగ్గినప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గుంటూరు నగరంలో ఇప్పటి వరకు 243 కేసులు నమోదు కాగా... ప్రస్తుతం 59 యాక్టివ్ కేసున్నాయి. నరసరావుపేటలో 197 పాజిటివ్ కేసులు నమోదు కాగా...ప్రస్తుతం 15మందికి చికిత్స అందుతోంది. మిగతా మండలాల్లో 163 కేసులు నమోదైతే... వీటిలో 77 కేసులు క్రియాశీలకంగా ఉన్నాయి.
జిల్లాలో 452 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా.... 151 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 46 వేల 849 మందికి సంబంధించి ఫలితాలు రాగా... అందులో 46 వేల 238 మందికి అంటే 99 శాతం మందికి కరోనా లేనట్లుగా నిర్ధరణ జరిగింది. పాజిటివ్‌గా నమోదైన మొత్తం కేసుల్లో నాలుగో వంతు మాత్రమే ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారి తాకిడితో కొత్త కేసులు బయటపడుతున్నాయి.
మరోవైపు కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు కొనసాగుతుండగా...నాన్ కంటైన్మెంట్ జోన్లలో షాపింగ్ మాల్స్, హోటళ్లకు జిల్లా అధికార యంత్రాంగం అనుమతిచ్చింది. మరోవైపు అధికారులు పరీక్షల వేగాన్ని మరింత పెంచారు. ఇది కీలకమైన సమయం కావటం వల్ల వైరస్ వ్యాప్తి జరగకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.