మూడు రాజధానుల ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని... పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ 229 రోజులుగా రాజధాని అమరావతి రైతులు ఉద్యమిస్తున్నారు. కరోనా నేపథ్యంలో 95 రోజులు దాటాక ఇళ్లల్లో నుంచే తమ నిరసన కార్యక్రమాలను కొమసాగిస్తున్నారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను తాజాగా గవర్నర్ ఆమోదించటంతో రైతులు, మహిళలు మళ్లీ వీధుల్లోకి వచ్చారు. తుళ్లూరు, వెలగపూడి, మందడం గ్రామాల్లోని శిబిరాల్లోనే ఇకనుంచి శాంతియుత నిరసన చేపట్టాలని నిర్ణయించారు.
హేతుబద్దత ఏది?
తాము 229 రోజులుగా ఉద్యమిస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని.... ఏకపక్షంగా ఆర్డినెన్సు ద్వారా బిల్లులను ఆమోదించిందని అమరావతి వాసులు తప్పుపడుతున్నారు. కరోనా వ్యాప్తి చెందుతున్నా ఇలాంటి సున్నితమైన పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు ఎక్కడా మారవని గుర్తు చేశారు. రాజకీయ కక్ష తప్ప... మూడు రాజధానుల ప్రతిపాదనలో ఎలాంటి హేతుబద్దత, శాస్త్రీయత లేదంటూ రైతులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఉద్యమం 29 గ్రామాల సమస్య కాదని.... 5కోట్ల మంది రాష్ట్ర ప్రజలందరూ స్పందించాలని వేడుకున్నారు.
ఉద్యమమే శరణ్యం
రాజధాని అమరావతి ప్రాంతంలో నిరసన ఉద్యమాన్ని గ్రామగ్రామాన విస్తరింపజేయాలని రైతులు, మహిళలు నిర్ణయించారు. ప్రభుత్వానికి తమ నిరసన చేరేవరకు ఉద్యమమే శరణ్యమని రైతులు, మహిళలు భావిస్తున్నారు. అమరావతి ప్రాంతానికి న్యాయం చేస్తామంటున్న ప్రభుత్వ పెద్దలు.... ఎలాంటి న్యాయం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల అభీష్ఠానికి వ్యతిరేకంగా గవర్నర్ వ్యవహరించారని వారు ఆరోపించారు. న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని.. ఓవైపు నిరసన కొనసాగిస్తూనే న్యాయపోరాటం చేస్తామని రైతులు, మహిళలు స్పష్టం చేశారు.
రాజధాని అమరావతికి అన్యాయం జరిగిందని... సీఆర్డీఏ చట్టాన్ని ఏకపక్షంగా రద్దు చేశారంటూ అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు, రైతులు, మహిళలు సోమవారం న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు.
ఇదీ చదవండి