VIDYAKANUKA KITS PRICES INCREASED : వచ్చే విద్యా సంవత్సరం(2023-24)లో విద్యా కానుక కింద రాష్ట్ర ప్రభుత్వం అందించే బూట్లు, బ్యాగ్‌ల ధరలు విపరీతంగా పెరిగాయి. 2023-24 సంవత్సరానికి విద్యా కానుకలకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిన సమగ్ర శిక్ష అభియాన్.. నోటు పుస్తకాలు మినహా మిగతా అన్నింటి సరఫరాకు ఇప్పటికే గుత్తేదారులతో ఒప్పందాలు కుదుర్చుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షల 10 వేల 165 మంది విద్యార్థులకు వెయ్యి 42.53 కోట్ల రూపాయలతో విద్యాకానుక కిట్లను అందించనున్నారు.
మెరిసిన బూట్లు.. పెరిగిన ధరలు: బూట్లు, బ్యాగ్‌ల ధరలు.. 2022-23 నాటి కంటే ఎక్కువగా ఉన్నాయి. నాణ్యమైన, పెద్ద సైజు బ్యాగ్‌లు ఇవ్వడం, ఈసారి మరింత మెరిసే బూట్లు కొంటున్నందున ధరలు పెరిగినట్లు అధికారులు చెబుతున్నా.. గుత్తేదారులు రింగ్ కావడం వల్లే ధరలు పెరిగాయన్న ఆరోపణలున్నాయి. బ్యాగ్‌ల సరఫరాకు మొదట టెండర్లు పిలిచినప్పుడు.. గుత్తేదారులు రింగై ఎక్కువ ధరకు కోట్ చేయడంతోనే వాటిని రద్దు చేశారు.
గతంలో కంటే 92 రూపాయలు అదనం: అనంతరం బ్యాగ్‌ల సైజులను 3 రకాలుగా విభజించి.. 5 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. ఇందులో ఒక ప్యాకేజీ మినహా నాలుగింటిలో నిర్ణీత ధర కంటే 10 శాతం నుంచి 15 శాతం వరకూ అధికంగా కోట్ చేశారు. రివర్స్ టెండర్లలోనూ ప్యాకేజీల్లో ధర తగ్గకపోవడంతో గుత్తేదారులతో అధికారులు బేరాలు చేశారు. చివరికి 272.90 రూపాయలకి సరఫరా చేసేందుకు గుత్తేదారులు అంగీకరించినట్లు తెలిసింది. ఇది కూడా 2022-23లో ఇచ్చిన బ్యాగ్ ధర కంటే 92 రూపాయలు ఎక్కువ. అయితే మూడు ప్యాకేజీల్లో బ్యాగుల టెండర్లు దక్కించుకున్న గుత్తేదార్లు.. ఈ సంవత్సరం సరఫరా చేసినవారే. రెండు ప్యాకేజీలకే కొత్తవారు వచ్చారు. ఈ సంవత్సరం సరఫరా చేసిన గుత్తేదారులు కూడా ధరలు అమాంతం పెంచేయడం చర్చనీయాంశమైంది.
విద్యార్థులు తగ్గినా.. ప్రభుత్వంపై భారం మాత్రం: బ్యాగ్‌లను సరఫరా చేస్తున్న ఇద్దరు గుత్తేదార్లకు బూట్ల సరఫరాలోనూ రెండు ప్యాకేజీలు దక్కాయి. 2023-24లో సరఫరా చేయనున్న బ్యాగ్‌ల ధరలు 269.60 నుంచి 272.90 రూపాయల వరకూ ఉన్నాయి. ఒక్క ప్యాకేజీలోనే 269.60 చొప్పున సరఫరా చేసేందుకు ముందుకొచ్చినట్లు తెలిసింది. జత బూట్లు, రెండు జతల సాక్సులను ఈ ఏడాది సరాసరిన 175 రూపాయలకు అందించగా... వచ్చే ఏడాది ఇచ్చేవాటి సగటు ధర 189 రూపాయలు. ఒక్కోదానిపై 14 రూపాయల వరకూ పెరిగింది. 2 లక్షల మందికి పైగా విద్యార్థులు తగ్గినా... ఈసారి ప్రభుత్వ ఖజానాపై పడే భారం మాత్రం 155.84 కోట్లు రూపాయలకు పైమాటే.
నో చర్యలు: ఈ సంవత్సరం సరఫరా చేసిన బ్యాగుల్లో నాణ్యత లేక చినిగిపోయినట్లు ఫిర్యాదులు వచ్చినా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెండర్ల సమయంలో గుత్తేదార్లు ఇచ్చిన సాంపిల్ బ్యాగ్ కనిపించకపోయినా.. కిందిస్థాయిలో ఇద్దరు అధికారులను సెక్షన్ మార్చి.. ఈ ప్రక్రియను ముగించేశారు. బ్యాగ్‌లు చినిగినట్లు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులొచ్చినా గుత్తేదార్లు.. అధికారులపై ఎలాంటి చర్యలూ లేవు.
చినిగిన 9లక్షల బ్యాగులు: రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల 14 వేల 687 మందికి బ్యాగ్‌లను సరఫరా చేయగా.. 15 రోజులకే చాలా చోట్ల చినిగిపోయాయి. జులై నుంచి అక్టోబర్ 7 లోపు సరఫరా చేసినవాటిలో చినిగిపోయిన బ్యాగ్‌ల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సమగ్ర శిక్ష అభియాన్ ఆదేశించింది. దాదాపు 9 లక్షల బ్యాగ్‌లు చినిగినట్లు ప్రధానోపాధ్యాయులు నమోదుచేశారు. అయితే చినిగిన బ్యాగ్‌లను పిల్లలు వెనక్కి ఇస్తే కొత్తవి ఇవ్వలేదనే విషయం తనిఖీల్లోనూ బయటపడింది.
ఇవీ చదవండి: