రాష్ట్రంలో అక్టోబరు 15న కళాశాలలు తెరవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సెప్టెంబరులో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఉన్నత విద్యపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి... పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఏడాది పాటు ఆనర్స్ డిగ్రీ
పాఠ్య ప్రణాళికలో మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మూడేళ్ల డిగ్రీ కోర్సులో 10 నెలల అప్రెంటిస్‌షిప్‌ను చేర్చామని చెప్పారు. దీనికి అదనంగా ఒక ఏడాది నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అంశాలపై శిక్షణ కూడా ఉంటుందని... దీనిని ఆనర్స్ డిగ్రీగా పరిగణిస్తామని సీఎం అన్నారు. అడ్మిషన్లు పొందినప్పుడే విద్యార్థులు సాధారణ డిగ్రీ కావాలో లేదా ఆనర్స్ డిగ్రీ కావాలో ఎంచుకోవాలని చెప్పారు. గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియోను 32.4 శాతం నుంచి 90 శాతానికి తీసుకెళ్లాలని సూచించారు. అక్రమాలకు పాల్పడే కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్
యూనివర్శిటీల్లో ఖాళీల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాదాపు 1,110 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. కళాశాలల్లో కూడా నాడు- నేడు కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి కార్యాచరణ పూర్తి చేయాలన్నారు.
కర్నూలులో క్లస్టర్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నామన్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. కడపలో ఆర్కిటెక్చర్ యూనివర్శిటీకి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు. తెలుగు, సంస్కృతం అకాడమీల ప్రారంభానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కురుపాంలో ట్రైబల్ ఇంజినీరింగ్ కళాశాల పనులు మొదలుపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో యూనివర్శిటీలు పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. పాడేరులో ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటుకు సీఎం అంగీకారం తెలిపారు. ఏటా కచ్చితమైన నిధుల కేటాయింపుతో వచ్చే మూడు.. నాలుగేళ్లలో వీటి నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
ఇదీ చదవండి