ఫొని తుపాను నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు... అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆర్టీజీఎస్, విపత్తు నిర్వహణ శాఖ అధికారులని అడిగి తుపాను ప్రభావం తెలుసుకున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యలను కలెక్టర్లతో సమీక్షించారు.
తుపాను రేపు ఉదయం 10.30 గంటలకు ఒడిశాలోని పూరీ సమీపంలో తీరం దాటనున్న నేపథ్యంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారు. ఆర్టీజీఎస్ అధికారులు ఇచ్చిన అంచనాలను నవీన్ పట్నాయక్‌తో చర్చించారు. ఒడిశాకు సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమని చంద్రబాబు తెలిపారు. కష్టకాలంలోనే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని చంద్రబాబు సూచించారు.
గతంలో తుపాను విపత్తు సమయంలో ఒడిశాకు ...రూ.30 కోట్ల విలువైన మెటీరియల్‌ను వారికి పంపిన విషయాన్ని అధికారులకు చంద్రబాబు గుర్తుచేసారు. ఉద్దానం ప్రాంతంలోని 15 మండలాలు, 200 గ్రామాలపై ప్రభావం ఉండవచ్చని విపత్తుల ప్రత్యేకాధికారి వరప్రసాద్, ఆర్టీజీఎస్ సీఈవో అహ్మద్‌బాబు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. 120 క్యాంపులను నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. టెక్కలి, పలాస కేంద్రాలుగా సూపర్ సైక్లోన్ బృందాలు పనిచేస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు.