CM JAGAN REVIEW : ప్రపంచవ్యాప్తంగా కరోనా తాండవం సృష్టిస్తున్న నేపథ్యంలో దేశం మొత్తం అప్రమత్తమైంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు కొవిడ్ విషయంలో ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సీఎం జగన్ పలు సూచనలు చేశారు. అనుమానాస్పద కేసుల్లో తప్పనిసరిగా పరీక్ష నిర్వహించాలన్నారు.
వైరస్ నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలి: రాష్ట్రంలో ఇప్పటివరకు కొత్త వేరియంట్ BF-7 ఎక్కడా నమోదు కాలేదని సీఎంకు అధికారులు తెలిపారు. విలేజ్ క్లినిక్‌లు కేంద్రంగా కొవిడ్ చికిత్స అందాలని.. టెస్టింగ్, మేడికేషన్ కోసం ANM, ఆశావర్కర్లు అందుబాటులో ఉండాలన్నారు. మాస్కులు ధరించడంతో పాటు వైరస్ నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మాస్కులు, పీపీఈ కిట్లు, టెస్టింగ్ కెపాసిటీపై మరోసారి సమీక్షించుకోవాలని సూచించారు.
కరోనా లక్షణాలు ఉన్నవారిని విలేజ్ క్లినిక్స్‌కు రిఫర్ చేయాలి: అంతర్జాతీయ ప్రయాణికులకు విమానాశ్రయాల్లో తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సీఎంకు అధికారులు తెలిపారు. కొవిడ్ లక్షణాలున్న వారిని తక్షణమే విలేజ్ క్లినిక్స్‌కు రిఫర్ చేసేలా ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. ఆసుపత్రుల్లోని సౌకర్యాలపై మరోసారి విస్తృతంగా తనిఖీలు చేపట్టాలన్నారు. జనవరి 5లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్న సీఎం...ఆ తర్వాత ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలు చేపట్టాలన్నారు. 320 టన్నుల మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్ అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే సిబ్బందికి అవసరమైన వసతి కల్పించాలి: వైద్య, ఆరోగ్యశాఖలో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది భర్తీపై అధికారులు నివేదిక సమర్పించారు. జనవరి 26 నాటికి మొత్తం నియామక ప్రక్రియ పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే సిబ్బందికి అవసరమైన వసతి కల్పించాలన్నారు. అన్నిచోట్లా వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం అందుబాటులో ఉండాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో నాడు – నేడు పైనా సమీక్షించిన సీఎం.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలల పనులు వేగవంతం చేయాలన్నారు.
ఇవీ చదవండి: