CM Jagan Negligence on Farmers Problems: బియ్యం ఎగుమతులు నిలిపేశామని కేంద్రం చెప్పగానే అగ్రదేశమైన అమెరికా సహా ఇతర దేశాలు ఉలిక్కిపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా సాగు పడిపోతున్నందున బియ్యం దొరికితే చాలనే పరిస్థితి ఉంది. సాధారణ రకం ధాన్యానికి కేంద్రం క్వింటాలుకు 2 వేల 183 ప్రకటించగా అదనంగా కొన్ని రాష్ట్రాలు బోనస్ ఇస్తున్నాయి. కేరళలో 780, తమిళనాడులో 75, ఝార్ఖండ్‌లో 110 చొప్పున అందిస్తున్నాయి.
తగ్గించి అమ్ముకోవాల్సిన దుస్థితి: తెలంగాణలో కాంగ్రెస్ క్వింటాలుకు 500, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ క్వింటాలుకు 300 చొప్పున బోనస్ ఇస్తామని ఎన్నికల ముందు ప్రకటించాయి. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం మాత్రం రైతులకు గోతాలిస్తున్నాం, రవాణా, హమాలీ ఖర్చుల భరిస్తున్నామని, అదే అదనపు సాయమని నమ్మబలుకుతూ మద్దతు ధరలోనే కోత పెడుతోంది. వరి సాగుచేసే రైతుల్ని పీల్చి పిప్పి చేస్తున్నా మిల్లర్లకే మద్దతు పలుకుతోంది. దీంతో అన్నదాతలు కేంద్రం నిర్ణయించిన మద్దతు ధర కంటే బస్తాకు సగటున 300 తగ్గించి అమ్ముకోవాల్సిన దైన్యం నెలకొంది.
పంటల బీమాపై రైతన్నల ఆశలు - పరిహారాలతో పరిహాసమాడుతున్న ప్రభుత్వం
హవా అంతా మిల్లర్లదే: రైతుల నుంచి తేమశాతం పేరుతో క్వింటాళ్ల కొద్దీ నిలువుదోపిడీ చేస్తున్నారు. 1 శాతం తేమ పెరిగితే కిలో అదనంగా ఇవ్వాలని ఆంక్షలు పెడుతున్నా వైసీపీ సర్కారు కళ్లప్పగించి చూస్తోంది. రైతులకు మద్దతు పలకాల్సిన కలెక్టర్లే మిల్లర్లతో మాట్లాడి తగ్గించి తీసుకోవాలని సూచిస్తున్నారు. తేమ శాతంతో పనిలేకుండా ధాన్యాన్ని తరలించాలని తుపాను సమయంలో మొక్కుబడి మాటలు తప్ప క్షేత్రస్థాయిలో ఏమవుతోందో పట్టించుకోవడం లేదు. తుపాను ముంచేసినా రైతుల గోడు పట్టడం లేదు. హవా అంతా మిల్లర్లదే. ఆర్బీకేలకు వెళ్తే రైతులకు గోతాలు ఇవ్వడం లేదు. లారీలు పెట్టడం లేదు.
మిల్లర్లు చెప్తే మాత్రం వెంటనే రైతుల పేర్లతో కొనుగోలు చేసినట్లు రాసి ట్రక్‌షీట్‌ను ఇస్తున్నారు. తుపాను హెచ్చరికల సమయం నుంచి రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వర్ష కురిస్తే ధాన్యం తడుస్తుందని, తీవ్రంగా నష్టపోతామని, త్వరగా కొనుగోలు చేయాలని ఆర్బీకేల చుట్టూ తిరిగి బతిమాలుకున్నారు. అయినా తేమ శాతం తగ్గించి తీసుకురావాలంటూ ఒకటికి పదిసార్లు తిప్పించుకున్నారు. కనీసం గోతాలు ఇచ్చినా వాటిలో నింపి మిల్లుకు తరలించేవారు. ఆరబెట్టిన ధాన్యం తడిసి మొలకలొచ్చేది కాదు. అయినా ఆర్బీకేల్లోని సిబ్బంది తేమ 15 శాతం లోపు ఉంటేనే కొంటామంటూ సతాయించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతుల అవస్థలు - ధాన్యం కొనే దిక్కులేక ఎదురుచూపులు
ఆర్బీకే సిబ్బంది సతాయింపులు, మిల్లర్ల వేధింపులు: తుపాను తీరం దాటి 10 రోజులు అయినా చాలాచోట్ల ధాన్యం సేకరణకు చర్యలు కొరవడ్డాయి. ఇప్పటికీ గోతాలు కూడా ఇవ్వలేదు. తేమ తగ్గాకే కొంటామని చెబుతున్నారు. రైతు భరోసా కేంద్రాలకు వెళ్లినా సరిగా పట్టించుకోవడం లేదనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో నేరుగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు చర్యలు కొరవడ్డాయి. తడిసిన, రంగు మారిన ధాన్యమైతే ఇప్పుడే కొనలేమని తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలేవీ లేవని ఆర్బీకే సిబ్బంది చెబుతుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఆర్బీకే సిబ్బంది సతాయింపులు, మిల్లర్ల వేధింపులతో రైతులు విసిగి వేసారుతున్నారు. చేసేది లేక తక్కువ ధరకే ప్రైవేటు వ్యాపారులకు అమ్మేస్తున్నారు.
మిగ్జాం తుపానుతో డీలా పడ్డ రైతన్న- పరిహారమన్నా ఇయ్యన్నా జగనన్న!