జాతీయ పతాక సృష్టికర్త పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సన్మానించారు. త్రివర్ణ పతాకానికి ఈ నెల 31తో వందేళ్లు కావస్తున్న సందర్భంగా.. జాతీయ పతాక సృష్టికర్త పింగళి వెంకయ్యను సీఎం గుర్తు చేసుకున్నారు. గుంటూరు జిల్లా మాచర్లలోని పింగళి కుమార్తె సీతామహాలక్ష్మి, ఆమె మనవడు నరసింహం ఇంటికి సీఎం వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దేశం గర్వపడే జాతీయ పతాకాన్ని అందించిన పింగళి వెంకయ్య జీవిత విశేషాలను కుటుంబ సభ్యులు సీఎంకు వివరించారు.
99 సంవత్సరాల వయసు ఉన్న సీతామహాలక్ష్మిని సీఎం పలకరించి ఆరోగ్య సమాచారం అడిగి తెలుసుకున్నారు. 75 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రొసీడింగ్స్‌ను సీఎం చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు. పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులతో సుమారు 20 నిమిషాల పాటు గడిపారు. మీడియా ప్రతినిధులను ఎవరిని అనుమతించలేదు. సీఎం జగన్ తమ ఇంటికి రావడం పట్ల పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి, మనవడు నరసింహం హర్షం వ్యక్తం చేశారు. తన మనవడే ఇంటికి వచ్చినట్లు ఉందని 99 ఏళ్ల సీతామహాలక్ష్మి వ్యాఖ్యానించారు.
పింగళి వెంకయ్యకు భారతరత్న అవార్డుపై సీతామహాలక్ష్మి స్పందిస్తూ... తన తండ్రికి భారతరత్న వస్తే సంతోషమేనని.. తాను ఉండగానే అది అందుకుంటే అంతకంటే సంతోషం ఏముంటుందని అన్నారు. పింగళి తెలువాడైనందుకు గర్వపడాలా.. రావాల్సినంత గుర్తింపు రాలేదని బాధపడాలో తెలియడం లేదని మనవడు నరసింహం తెలిపారు. సీతామహాలక్ష్మిని సత్కరించడం అంటే వెంకయ్యగారిని సత్కరించడమేనని అన్నారు. జాతీయ జెండా ఔన్నత్యాన్ని కాపాడటం ద్వారా పింగళి వెంకయ్యకు అసలైన నివాళి అని నరసింహం అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: