CM Jagan Foundation Stone For Houses Constructions in Amaravati: హైకోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉండగానే రాజధాని నిర్మాణానికి ఇచ్చిన భూముల్లో పేదల ఇళ్ల నిర్మాణానికి.. సీఎం జగన్ భూమిపూజ చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి.. కృష్ణాయపాలెంలేని లేఅవుట్‌కు హెలికాప్టర్‌లో వచ్చిన ముఖ్యమంత్రి.. అక్కడ పైలాన్‌ను ఆవిష్కరించారు. ఇళ్ల నిర్మాణానికికి భూమి పూజ చేశారు. ఒకరిద్దరు లబ్దిదారులతో.. మాట్లాడారు. ఆ తర్వాత నమూనా గృహాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి,. మళ్లీ హెలికాప్టర్ ఎక్కిన సీఎం వెంకటపాలెంలోని సభాస్థలికి చేరుకున్నారు.
ఈ రోజు రాష్ట్ర చరిత్రలోనే (జులై 24) ప్రత్యేకంగా నిలిచిపోతుందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. పేదల శత్రువులతో పోరాడి రాజధాని ప్రాంతంలో ఇళ్లు నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. కొన్ని దుష్టశక్తులతోపాటు ఊరు, పేరు లేని కొన్ని సంఘాలు కోర్టులకు వెళ్లాయని ఆయన ఆరోపించారు. ఇక్కడ పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు వేశారని, రెండిటిలోనూ ఏపీ ప్రభుత్వమే గెలిచి.. ఇళ్ల పట్టాలు ఇచ్చిందని అన్నారు.
ఇళ్లు కట్టకుండా కేంద్ర ప్రభుత్వంలోనూ అడ్డుకునే ప్రయత్నాలు చేశారన్నారు. రాజధానిలోని ఆర్ 5 జోన్‌లోని 1402 ఎకరాల్లో ఇళ్ల నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. మొత్తం 25 లేఅవుట్లలో 50వేల 793 ఇళ్లను నిర్మించేందుకు శంకుస్థాపన చేశామని తెలిపారు. సామాజిక న్యాయ పోరాటం ఇదన్న సీఎం.. పెత్తందారులపై పేదల విజయం అని పేర్కొన్నారు. ఇదొక్కటే కాదు పేదలకు ఏది మంచి చేసినా దాన్ని అడ్డుకుంటారని విమర్శించారు.
పేదవాడి పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ఎందుకన్నారు, మరి పెత్తందారుల పిల్లలు ఇంగ్లీష్ బడులకు ఎందుకెళ్లారని ప్రశ్నించారు. మహిళకు ఆర్థిక సాయం అందిస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందా అని నిలదీశారు. ఇంతే బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో గతంలో ఎందుకు అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాయం చేయలేకపోయారని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలను అందించేందుకు వాలంటీర్లను పెడితే ఈ వ్యవస్థను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాజధాని అమరావతిలో పేదలకు సెంటు స్థలం ఇచ్చి ఇళ్లు కడితే ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించారు.
కులాల సమతుల్యత దెబ్బ తింటుందని కోర్టులకు వెళ్తారా అంటూ మండిపడ్డారు. ఇంత మానసిక, నైతిక దివాలా తనాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. పేదల పథకాలను అడ్డుకుంటే హీరోయిజం అవుతుందా అని ప్రశ్నించారు. ఇవాళ్టి నుంచి ఈ అమరావతి మన అందరి అమరావతి, సామాజిక అమరావతి అని జగన్ తెలిపారు. 50వేల 793 మందికి పట్టాలు ఇచ్చామని, అందరూ ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారన్నారు. ఇక ఆ బాధ్యతను ప్రభుత్వమే చేపడుతుందన్నారు. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో 25 లే అవుట్లల్లో ఇళ్లు నిర్మిస్తామన్నారు. ల్యాండ్ లెవెలింగ్ కోసం ఇప్పటికే 67 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.
ఒక్కో ఇంటికి 2.70 లక్షల రూపాయల వ్యయం అవుతుందని, 50వేల 793 ఇళ్ల నిర్మాణం కోసం 1370 కోట్లు అవుతుందన్నారు. నీటి సరఫరా కోసం 30 కోట్లు, విద్యుత్ కోసం 360 కోట్లు, రహదారులు కోసం టెండర్లు కూడా జారీ అయిపోయాయని తెలిపారు. పార్కులు, పాఠశాలలు, ఇతర సామాజిక మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయని, ఒక్కో ఇంటి విలువ 10-15 లక్షలు ఉంటుందని అన్నారు. అమరావతిలో ఒక్కో గజం విలువే 15 వేల రూపాయలు ఉంటుందని, ఇక్కడ కట్టే ఇంటి విలువ 12 -15 లక్షల మేర ఉంటుందన్నారు.