CM Jagan About Health Hub in AP: హెల్త్ హబ్‌ల ఏర్పాటుపై ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేసి రెండేళ్లు దాటినా.. ఇంతవరకూ ఒక్క హబ్ ఏర్పాటుకూ అడుగు ముందుకు పడకపోవడం.. వైఎస్సార్సీపీ పాలనలో డొల్లతనానికి నిదర్శనంగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి ఆర్భాట ప్రకటనలకు, ఆచరణలో జరిగే వాటికి సంబంధమే ఉండటం లేదు. రాష్ట్రంలోని 16 మున్సిపల్, కార్పొరేషన్ల పరిధిలో హెల్త్ హబ్‌ల ఏర్పాటు జరిగేలా.. రాష్ట్ర ప్రభుత్వం 2021 నుంచి హడావుడి మొదలుపెట్టినా.. ఇప్పటివరకూ ఒక్కటీ ఏర్పాటుకాలేదు. ఉచితంగా 5 ఎకరాలు ఇస్తాం.. పెట్టుబడులు పెట్టండి అని సీఎం జగన్ పదేపదే ప్రకటనలు చేసినా.. వాటికి తగ్గట్లు పెట్టుబడిదారుల నుంచి స్పందన కనిపించడం లేదు. మొదట్లో హైదరాబాదులోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయి. కానీ సర్కారు నుంచి తగిన చేయూత లభించకపోవడంతో తరువాత పట్టించుకోలేదు. పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్ర ప్రభుత్వ ఘోర వైఫల్యానికి ఇదే స్పష్టమైన నిదర్శనం.
No Facilities in Hospital: పేరుకే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.. అక్కడికి వెళ్లే రోగులకు..
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో మల్టీ, సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులో లేని పరిస్థితి. దీంతో మెరుగైన వైద్యం కోసం పేషెంట్స్.. సొంత నగదును ఖర్చుపెట్టి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు వెళ్తున్నారు. ఇలా వెళ్లాల్సిన అవసరం లేకుండా.. రాష్ట్రంలోనే 16 హెల్త్ హబ్‌లు ఏర్పాటుకు జగనన్న ప్రభుత్వం చేపట్టిన మహా యజ్ఞంలో భాగస్వాములు కావాలంటూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పిలుపునిచ్చినా, నిబంధనలు మార్చినా ఆసుపత్రుల ఏర్పాటులో పారిశ్రామికవేత్తలు వెనుకడుగు వేస్తున్నారు. గతంలో నిర్దేశించిన 12 ఏళ్ల పెర్ఫార్మెన్స్ బ్యాంకు గ్యారెంటీ వ్యవధిని రెండేళ్లకు తగ్గింపుతో పాటు కేటాయించిన భూమి విలువలో 25 శాతం మొత్తాన్ని పీబీజీ కింద ఉంచాలనే నిబంధన.. 2022 జనవరి 5 తర్వాత రెండోసారి పిలిచిన టెండర్లలో ఎంపికైనవారికే వర్తిస్తుందనే మినహాయింపులు ఇచ్చినా.. స్పందన శూన్యం.
Chintalapudi Area Hospital: మూడేళ్లుగా పనులు.. పూర్తయ్యేది ఎన్నడో.. రోగుల ఎదురుచూపులు
2021 సంవత్సరంలో నవంబరు 5వ తేదీన టెండర్లను ఆహ్వానించగా.. కర్నూలు జిల్లా హబ్‌కు మాత్రమే బిడ్ దాఖలైంది. నిబంధనలు స్వల్పంగా సవరించి మరోసారి టెండరు పిలవగా.. రాజమహేంద్రవరంలో హాస్పిటల్ ఏర్పాటుకు భారత్ మెడికల్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఒంగోలు కోసం సౌత్ ఛాయిస్ హాస్పిటల్స్ మాత్రమే బిడ్లు దాఖలు చేశాయి. మొత్తం పడకల సంఖ్య, నిర్మాణ పెట్టుబడి, సూపర్ స్పెషాలిటి సేవలు, ఆరోగ్యశ్రీ పడకల సంఖ్య, నిర్మాణ వ్యవధి, స్పెషలిస్ట్ వైద్యులు.. ఇలా అంశాల ప్రాతిపదికగా ఎక్కువ మార్కులు పొందినవారితో.. ఒప్పందానికి ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవడంలో సాంకేతిక, అంతర్గత సమస్యలతో పాటు రకరకాల కారణాలతో నిర్ణయాల్లో స్తబ్దత నెలకొంది. ఫలితంగా రాజమహేంద్రవరం, కర్నూలు, ఒంగోలులో హాస్పిటల్స్‌ల ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంస్థలకూ భూమి అప్పగింత ఇంకా పూర్తి కాలేదు. ఈ ప్రక్రియ అంతా సవ్యంగా సాగితేనే హాస్పిటల్స్ అందుబాటులోకి వచ్చేందుకు రెండేళ్ల కాలం పడుతుంది. మూడు హెల్త్ హబ్‌ల ఏర్పాటుకే ఇంతకాలం పడితే.. ఇక మిగిలిన 13 చోట్ల అందుబాటులోకి రావాలంటే ఏళ్ల తరబడి వేచి చూడాల్సిందే.
రాష్ట్రంలో ప్రభుత్వపరంగా.. ప్రైవేటురంగంలోనూ సూపర్ స్పెషాలిటీ వైద్యం అంతగా అందుబాటులో లేకపోవడంతో.. కార్డియాలజీ, న్యూరాలజీ, ఆంకాలజీ, తదితర విభాగాల్లో అత్యాధునిక చికిత్సల కోసం రోగులు పొరుగు రాష్ట్రాల రాజధానులపైనే ఆధారపడుతున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీ కింద సుమారు 18 వేలమంది రోగులు.. రాష్ట్రం వెలుపల ఉన్న నగరాల్లో చికిత్స పొందారు. ఈ సంఖ్య అధికారిక లెక్కల ప్రకారం.. ప్రస్తుతం 32 వేల వరకు చేరింది. ఈ కారణంగా ఆయా రాష్ట్రాల ఆసుపత్రులకు సుమారు 250 కోట్ల రూపాయల చెల్లింపులు జరుగుతున్నాయి.
2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఏటా సుమారు లక్షా 25 వేల మంది రోగులు కూడా తమ సొంత జిల్లా వెలుపల మల్టీ, సూపర్ స్పెషాల్టీ చికిత్సలు చేయించుకున్నారు. ఇలా సొంత ఖర్చులతో చికిత్సల కోసం వెళ్లేవారి సంఖ్య రాష్ట్రంలో అధికంగానే ఉంది. ఉన్నతస్థాయి వైద్యం కోసం పెట్టే ఖర్చుతోపాటు ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు రవాణా, రోజుల కొద్దీ అక్కడే ఉండేందుకు.. ఇతర అవసరాలకు భారీగా వెచ్చించాల్సి వస్తోంది. ఫలితంగా అనారోగ్యాలతో అప్పటికే అవస్థల పాలైన కుటుంబాలు.. ఆర్థికంగా మరింత కోలుకోలేని దుస్థితిలోకి దిగజారుతున్నాయి. ఇలాంటి అవస్థలను తప్పించడంలో పేద రోగులకు హెల్త్ హబ్స్ వరప్రదాయినులు కాబోతున్నాయని సర్కారు చేసిన ప్రకటనలు ఉత్తుత్తివిగా మారాయి. ప్రభుత్వంలో చిత్తశుద్ధి లోపించడం.. సీఎం జగన్ మాటలు నీటిమూటలుగా మారడంతో ఆధునిక వైద్యం కోసం ఆత్రుతతో చూస్తున్న రాష్ట్ర ప్రజలకు నిరాశే మిగిలింది.