Acharya Nagarjuna University: గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ 37, 38వ స్నాతకోత్సవాలు శనివారం జరగనున్నాయి. ఇప్పటికే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణకు ఈ కార్యక్రమంలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కార్యక్రమానికి హాజరవుతున్నారు. శనివారం ఉదయం 11.30నిమిషాలకు స్నాతకోత్సవం ప్రారంభం కానుంది. పట్టాలు తీసుకునే విద్యార్థులంతా ఉదయం పదిన్నరకు డైక్‌మెన్ సమావేశ మందిరానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.
యూజీ, పీజీ విభాగాల్లో 39 వేలు, పీహెచ్‌డీ పూర్తి చేసిన 775మందికి పట్టాలు ఇవ్వనున్నారు. వీరిలో 228మందికి బంగారు పతకాలు, 18 మందికి ప్రత్యేక బహుమతులు అందించనున్నారు. స్నాతకోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీలను నియమించారు. జస్టిస్ ఎన్వీ రమణ ఇదే యూనివర్శిటిలో న్యాయవిద్య అభ్యసించారు. తమ విద్యాసంస్థలో చదివి దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి పీఠంపై కూర్చున్న రమణకు యూనివర్శిటీ తరపున ఘన స్వాగతం పలుకుతున్నారు. పూర్వవిద్యార్థుల తరపున జస్టిస్ రమణకు అభినందనలు తెలిపారు.
ఇవీ చదవండి: