Citizens for Democracy Organization Inaugural Meeting: రాష్ట్రంలో జైళ్లలో ఎందుకు పెడతారో, ఎందుకు వదిలేస్తారో తెలియని దుర్భర పరిస్థితి ఏర్పడిందని.. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అధ్యక్షుడు జస్టిస్ భవానీ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వేచ్ఛాయుత ఎన్నికలు- ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ’ అనే అంశంపై విజయవాడలో సిటిజన్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ఆయన అధ్యక్షత వహించగా కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ వీఎస్ సంపత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేలా దోహదపడటమే తమ లక్ష్యమని సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా ఏర్పాటైన.. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఆరంభ సభ విజయవాడలో ఘనంగా జరిగింది. మొఘల్ రాజపురంలోని సిద్దార్థ కళాశాల ఆడిటోరియంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ వీఎస్ సంపత్ హాజరయ్యారు. నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికలు- ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు అనే అంశంపై సంస్థ ప్రతినిధులు, అతిథులు ప్రసంగించారు. ఏదో ఒక ప్రాంతంలో వ్యవస్థకు కోపం వస్తే బుల్‌డోజర్‌తో ఇల్లు కూలగొట్టేస్తారు.. నోటీసు, విచారణ, ఉత్తర్వులు ఏమీ ఉండవని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అధ్యక్షుడు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జి. భవానీ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.
"ఈనాడు మనం దురదృష్టవశాత్తు అనేక సంఘటనలు చూస్తున్నాం. మణిపూర్‌లో గానీ.. ఎక్కడో ఎదో ప్రాంతంలో వ్యవస్థకు కోపం వస్తే బుల్‌డోజర్‌తో వారి ఇల్లు కూలగొట్టేస్తారు. ఇల్లు కూలగొట్టేముందు.. ఓ నోటీసుగానీ, ఓ ఉత్తర్వు గానీ, ఓ విచారణగానీ ఏమీ ఉండదు. నిజంగా మీరు మంచివారు కాకపోవచ్చు.. నేరస్థులు కావచ్చు. కానీ మీ ఇల్లు కూలగొట్టే ముందు భారత రాజ్యంగం ఏర్పాటు చేసిన వ్యవస్థ ప్రకారం.. పాటించని స్థాయికి రాజ్యం వెళ్లిపోతే.. అది రేపు మీకు జరగవచ్చు. నాకు జరగవచ్చు."-జస్టిస్ జి.భవానీ ప్రసాద్, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అధ్యక్షుడు
ఏపీలో పలువురిపై నమోదు చేసిన రాజద్రోహం కేసులపై సుప్రీంకోర్టు విచారణ
ఎవరో వస్తారని, ఏదో చేస్తారని కాకుండా కలిసికట్టుగా అడుగులు వేద్దామనే ఆలోచనతో సంస్థను ఏర్పాటు చేశామని మాజీ సీఎస్ ఎల్‌వీ సుబ్రమణ్యం చెప్పారు. యువతకు బంగారు భవిష్యత్తు కోసం.. వనరుల్ని జాగ్రత్తగా వినియోగించుకునేలా కృషిచేద్దామని సూచించారు.
"మనందరం కూడా మొద్దు నిద్ర నుంచి బయటకు వచ్చి చైతన్యవంతులుగా.. మనం చేద్దామనుకున్నా కార్యక్రమాన్ని సూక్ష్మంగా ఆలోచన చేసి మనందరి బాగు కోసం, జాతి బాగు కోసం, యువతకు బంగారు భవిష్యత్ తయారు చేయటం కోసం.. మన మధ్య ఉన్న వనరుల్ని ఎంత వరకు వినియోగించుకోవాలో ఆలోచన చేసుకుంటూ.. తప్పకుండా ప్రజస్వామ్య ఆలోచన విలువలతో మనం ముందుకు వెళ్తామని నేను అనుకుంటున్నాను." -ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, మాజీ సీఎస్
రాష్ట్రంలో తెలుగు అమలుపై భాషాభివృద్ధి సంస్థ పనితీరును పరిశీలిస్తాం: హైకోర్టు
ఎన్నికైన ఏ ప్రభుత్వమైనా ప్రజల హక్కులకు, సంపదకు కాపలాదారు మాత్రమేనని.. మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ అన్నారు. ప్రజల నెత్తిమీద కూర్చొని స్వారీచేస్తామంటే కుదరదని స్పష్టంచేశారు. రాగద్వేషాలతో పరిపాలన చేస్తే న్యాయస్థానాలు ఉపేక్షించవన్నారు. రాష్ట్రంలో సర్పంచులంతా ఆందోళన బాటలో ఉన్నారని.. వాలంటీర్ వ్యవస్థ కారణంగా నిధులు, విధులు లేక ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.
"మొన్నటికి మొన్న సీఏజీ ఏం చెప్పారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసి గ్రామ సచివాలయ వ్యవస్థ రాజ్యంగ సవరణకు విరుద్దంగా ఉన్నాయని చెప్పి విష్మయం కూడా వ్యక్తం చేశారు." -నిమ్మగడ్డ రమేశ్‌కుమార్, మాజీ ఎస్‌ఈసీ
'జ్యోతిషం ప్రకారం తెలంగాణలో ముందస్తు ఎన్నికలు'
ఓటర్ల జాబితాను తక్కువ అంచనా వేయొద్దని.. వాటిలో అక్రమాలు చోటుచేసుకుంటే ఎన్నికల్లో గెలుపోటములు 50శాతం మేర ప్రభావితమవుతాయని.. కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ వీఎస్ సంపత్ అన్నారు. దీనిపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
"మాసివ్ ఎలక్షన్ పోగ్రాం జరుగుతున్నప్పుడు ఒక ప్రధాన ఎన్నికల సంఘం కమిషనర్ రిటైర్డ్ అయ్యారు. ఇంకోక సీఈసీ ఛార్జ్ తీసుకున్నారు. ఒక ఈసీని జాయిన్ చేశారు. ఇదంతా ఎంత స్మూత్‌గా జరిగిందంటే.. నేను చెప్పే వరకు మీరు కూడా ఇది ఆలోచించి ఉండారు." -వీఎస్ సంపత్, మాజీ ప్రధాన కమిషనర్, కేంద్ర ఎన్నికల సంఘం
సిటిజన్ ఫర్ డెమోక్రసీ పేరిట వెబ్ సైట్ నుంచి ప్రజలు అవసరమైన సేవలు అందుకోవచ్చని ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో ఓటర్లలో చైతన్యం కల్పించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.