CID Case on CBN in Free Sand Procedure: తెలుగుదేశం హయాంలో ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ.. చంద్రబాబు సహా మరికొందరు తెలుగుదేశం నేతలపై సీఐడీ కేసు నమోదు చేసింది. గనుల శాఖ డైరెక్టర్ ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీ వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు పెట్టింది. చంద్రబాబును రెండో నిందితుడిగా పేర్కొనగా.. అప్పటి గనుల శాఖ మంత్రి పీతల సుజాత ఏ1గా, తెలుగుదేశం నేతలు చింతమనేని ప్రభాకర్ ఏ3గా, దేవినేని ఉమామహేశ్వరరావు ఏ4 సహా ఇతరుల్ని నిందితులుగా చేర్చింది.
నేరపూరిత కుట్ర, నేరపూరిత విశ్వాస ఘాతుకం, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద సీఐడీ ఈ కేసు నమోదు చేసింది. వెంకటరెడ్డి అక్టోబరు 3న సీఐడీకి ఫిర్యాదు చేయగా.. ఈ నెల 1న కేసు సీఐడీ కేసు నమోదు చేసింది. ఆ ఎఫ్ఐఆర్ను సీఐడీ అధికారులు ఏసీబీ న్యాయస్థానానికి సమర్పించారు.
Illegal Sand Mining in Krishna River: కృష్ణాతీరంలో ఇసుక తవ్వకాలు.. కొండలను తలపిస్తున్న ఇసుక డంపులు
వైసీపీపై సీబీఐకి టీడీపీ ఫిర్యాదు తర్వాత చంద్రబాబుపై కేసు: ఇసుక తవ్వకాల ద్వారా జగన్, ఆయన బృందం 40 వేల కోట్లు లూటీ చేశారని.. తాజాగా పిలిచిన టెండర్లలోనూ భారీ కుంభకోణం ఉందని పేర్కొంటూ తెలుగుదేశం ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్ అక్టోబరు 29న సీబీఐ, సీవీసీకి ఫిర్యాదు చేయగా.. ఆ తర్వాత మూడు రోజులకే జగన్ ప్రభుత్వం సీఐడీని ప్రయోగించి చంద్రబాబుపై రివర్స్ కేసు పెట్టింది.
ఉచితంగా ఇచ్చిన ఇసుకలో అక్రమాలేంటి: గత 16 నెలల వ్యవధిలో తాడేపల్లి ప్యాలెస్‌కు 2 వేల కోట్లు చేరాయని.. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఇటీవలే ఆరోపించారు. ఇసుక దోపిడీ వల్ల వెయ్యి ఉండే ట్రాక్టర్ లోడ్ ధర ప్రస్తుతం 5వేలకు చేరింది. అసలు ఇసుక కుంభకోణం జరుగుతున్నదే ప్రస్తుత జగన్ ప్రభుత్వంలో కాగా.. దొంగే దొంగ అన్నట్లుగా అప్పట్లో ఉచితంగా ఇసుక ఇచ్చిన చంద్రబాబుపై కేసు నమోదు చేయడం ఏంటని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఐడీ తాజా కేసును తెరపైకి తెచ్చింది.
Sand Mafia in graveyard శ్మశానాన్ని వదలని ఇసుకాసురులు.. అస్తిపంజరాలు బయటపడటంతో భయాందోళనలో ప్రజలు
తెలుగుదేశం హయాంలో 2014లో తొలుత ఇసుక రీచ్‌లను జిల్లా, మండల మహిళా సమాఖ్యలకు అప్పగించారు. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల ఆధారంగా ఇసుక తవ్వకాలకు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. అందులో భాగంగానే 2016 జనవరిలో ఉత్తర్వులిచ్చారు. రెండు నెలల్లోనే ఆ నిర్ణయాన్ని మార్చుకుని ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చారని, ఈ విషయంలో బిజినెస్ రూల్స్ పాటించలేదని.. ఇసుక తవ్వకాలపై ఎలాంటి నియంత్రణలు విధించలేదని.. సీఐడీ తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది.
అక్రమ తవ్వకాలను అడ్డుకోవటానికి చర్యలు చేపట్టలేదని, ఈ విధానం వల్ల సీనరేజీ, ఇతర ఫీజుల రూపంలో ఖజానాకు రావాల్సిన ఆదాయం రాకుండా పోయిందని తెలిపింది. చట్టవిరుద్ధంగా అనుచితంగా లబ్ధి పొందేందుకే ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చారని ఆక్షేపించింది. అప్పట్లో అధికార పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు.. ప్రైవేటు వ్యక్తులు ఇసుక రీచ్‌లు, తవ్వకాలను తమ గుప్పిట్లో పెట్టుకుని దోచుకున్నారని అభియోగాలు మోపింది.
అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, గనుల శాఖ మంత్రి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కొందరు ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు లబ్ధి పొందారని తెలిపింది. 2016 నుంచి 2019 మధ్య ఇసుక అక్రమ తవ్వకాలపై వెయ్యి కేసులు నమోదయ్యాయని ఎన్జీటీ కూడా పలుమార్లు అక్రమ తవ్వకాలను ఆక్షేపించిందన్న సీఐడీ 40 కోట్లు పెనాల్టీ వసూలు చేసిందని ఎఫ్ఐఆర్లో పేర్కొంది.