Chief Minister Jagan too Much Campaign he is Helping Farmers: మాటలు తక్కువ చెప్పాలి. పనులు ఎక్కువ చేయాలనేది పెద్దలు చెప్పే మాట. కానీ, మన రివర్స్ పాలకుడు జగన్ తీరే వేరు. గోరంత సాయానికి కొండంత ప్రచారం చేసుకుంటారాయన. తీరిక లేకుండా బటన్లు నొక్కుతున్నట్లు.. కలరింగ్ కూడా ఇస్తున్నాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దేశంలోనే ఎవరూ ఇవ్వనంత పెట్టుబడి సాయం ఇస్తున్నాన్నంటూ అలవోకగా అబద్ధాలు చెప్పేస్తున్నారు. పొరుగునున్న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రైతు బంధుతో పోల్చితే.. ఏపీ ప్రభుత్వం ఇస్తున్న వైఎస్సార్ రైతు భరోసా దుక్కి దున్నడానికీ సరిపోని పరిస్థితి.
'మే మాసం వచ్చేసరికి పంటసాగుకు సన్నద్ధమయ్యే సరికి.. పెట్టుబడి కోసం రైతులు ఇబ్బందిపడకూడదు అనే ఉద్దేశ్యంతో.. ప్రతి రైతన్నకు రైతన్న చేతిలో ఏకంగా 12వేల 500 రూపాయలు ఏకంగా రైతన్న చేతిలో పెట్టే కార్యక్రమం రైతు భరోసా. రైతులు చేతులో పెట్టటం అనేది దేశ చరిత్రలో ఎక్కడా లేదు అని నేను తెలియజేస్తున్నా.'అని 2019లో రైతు దినోత్సవం సందర్భంగా జమ్మల మడుగులో.. జగన్ ఇచ్చిన ఊకదంపుడు ఉపన్యాసం.
రైతు భరోసా దేశ చరిత్రలోనే ఎక్కడా లేదట.! దేశందాకా ఎందుకుగానీ, పొరుగునున్న తెలంగాణతో పోల్చి చూస్తే జగన్ గోరంత సాయానికి కొండంత ప్రచార స్టంట్ ఇట్టే.. తెలిసిపోతుంది. రైతుల చేతిలో ఏటా 12 వేల 500 రూపాయలు పెడుతున్నారట జగన్. నిజానికి వైసీపీ ప్రభుత్వం ఇస్తోంది కేవలం 7వేల 500 రూపాయలు మాత్రమే. అది కూడా ఏటా మే వచ్చేసరికి ఠంచనుగా ఏమీ ఇవ్వడంలేదు. రెండు విడతల్లో ఇస్తున్నారు. పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం ఇస్తున్న 6 వేల రూపాయలకూ జగనే బటన్ నొక్కుతున్నట్లు కలరింగ్ ఇస్తున్నారు.
జగన్ ఏటా రైతు కుటుంబానికి ఇస్తోంది అక్షరాలా 7 వేల 500 రూపాయలే. అదే పక్కనున్న తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పేరిట.. ఎకరాకు 10 వేల చొప్పున.. రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. తెలంగాణలో ఎకరా పొలం ఉన్న రైతులు ఖరీఫ్‌లో 5 వేలు, రబీలో 5 వేల రూపాయలు ఇస్తున్నారు. ఎన్నెకరాలుంటే అంతటికీ ఇస్తున్నారు. భార్య భర్తల పేరుతో చెరొక రెండెకరాలు ఉంటే.. ఏడాదికి 40 వేలు అందుతోంది. కానీ, ఏపీలో ఇస్తోంది 7వేల 500 మాత్రమే.
నాలుగెకరాలున్న రైతుకు ఏపీలో ఐదేళ్లకు అందేది 37 వేల 500 రూపాయలే. అదే తెలంగాణలో 2లక్షలు అందుతుంది. అంటే జగన్ నొక్కే బటన్ల కన్నా.. తెలంగాణలో లక్షా 62 వేల 500 రూపాయలు ప్రతీ రైతు కుటుంబానికి అదనంగా సాయం అందుతోంది. తెలంగాణలో రైతులకు లక్ష వరకూ రుణమాఫీ కూడా చేస్తున్నారు.
ఏపీలో జగన్ మాత్రం దేశంలో నాకంటే గొప్ప రైతుబాంధవుడు లేడంటూ డప్పులు కొట్టుకుంటున్నారు. అది ఆయనకు తప్ప మరెవరికీ అర్థంకాని అంకెల గారడీ మాత్రమే కాదు. జనానికి వేసే పెద్ద బురిడీ. గత నాలుగేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో రైతులకు పెట్టుబడి సాయం అందిన తీరును చూసినా జగనన్న ప్రచారం ఎక్కువ సాయం తక్కువ అని ఇట్టే తెలిసిపోతుంది.
తెలంగాణలో రైతులకు అందుతున్న సాయం మన రాష్ట్రమిచ్చే సాయంతో పోల్చినప్పుడు ఇలా
- 2019-20 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం 10వేల 532 కోట్ల రూపాయలు రైతుకు ఆర్థిక సాయం చేస్తే జగన్ ప్రభుత్వం.. 3వేల 648కోట్లతో మమ అనిపించింది.
- 2020-21లో తెలంగాణ ప్రభుత్వం 14 వేల 658 కోట్లు రైతుల ఖాతాల్లో వేస్తే ఏపీ ప్రభుత్వం 3వేల 962 కోట్లుతో సరిపెట్టింది.
- 2021-22లో 14 వేల773కోట్ల రూపాయల పెట్టుబడి సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తే.. ఏపీ ప్రభుత్వం 3వేల 825కోట్ల రూపాయలు ఇచ్చింది.
- 2022-23లో తెలంగాణ ప్రభుత్వం 14 వేల 743 కోట్లు అందించగా.. రైతు బిడ్డనని చెప్పుకునే జగన్ 3వేల 988కోట్లు ఇచ్చి మమ అనిపించారు.
Free Crop Insurance: గందరగోళంగా పంటల బీమా.. తీరని అన్యాయం జరిగిందంటున్న రైతుల
మొత్తంగా ఐదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం కింద 54 వేల 706 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తే.. తీరికలేకుండా బటన్లు నొక్కుతున్నానని చెప్పుకునే జగన్ చేసిన సాయం మాత్రం.. 15 వేల 423 కోట్ల రూపాయలు మాత్రమే. ఇప్పుడు చెప్పండి జగన్ మీరు రైతు బంధా? ప్రచార బంధా? దేశంలో మీరు గొప్ప ప్రచారంలోనా? పెట్టుబడి సాయంలోనా?
తెలంగాణలో ఒక్కో ఎకరానికి రూ.10 వేలు ఇస్తుంటే.. ఇక్కడ మీరు ఒక్కో రైతు కుటుంబానికి రెండు విడతల్లో ఇచ్చేది రూ.7,500 మాత్రమే కదా? ఈ సొమ్ము.. రెండున్నర ఎకరాలకు 80% పెట్టుబడి కింద సరిపోతుందా? అసలు ఎకరా సాగుకు ఎంత పెట్టుబడి అవుతుందో తెలుసా? 70లక్షల మంది రైతులకు ఇస్తామని గొప్పలు చెప్పి 52 లక్షలకు కుదించిన సంగతైనా గుర్తుందా? ఈ మాత్రానికే దేశ చరిత్రలోనే అని డప్పు వేసుకోవడం మీకే చెల్లుతుందేమో?
అక్రమ మట్టి తవ్వకాలను నిరసిస్తూ.. అమరావతిలో రోడ్డెక్కిన రైతులు