Chandrababu writes an open letter to people: వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న నేరాలు, ఘోరాలపై రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో సీఎం వైఖరి, ప్రభుత్వ అసమర్థత నేరగాళ్లకు మరింత ఊతం ఇచ్చేలా ఉందని ధ్వజమెత్తారు. గత మూడు రోజుల్లో జరిగిన నాలుగు అంశాలు ప్రస్తావిస్తూ రాష్ట్ర పరిస్థితి పై ప్రజలు ఆలోచన చేయాలని చంద్రబాబు కోరారు. మహిళల భద్రత, ఆస్తుల రక్షణ, చట్ట సభల్లో గౌరవం లేదని, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంటూ నాలుగు అంశాలను లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, వైసీపీ నేతల భూకబ్జాలు, నేరగాళ్ల విశృంఖలత్వం, బిల్లులు రాక కాంట్రాక్టర్ల ఆత్మహత్యలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి, గన్ కల్చర్ అడ్డులేకుండా వ్యాపిస్తున్నాయని మండిపడ్డారు.
మహిళలపై వేధింపులు : నవ్యాంధ్ర ప్రజలు జగన్ రెడ్డి పాలనలో ప్రతిరోజు అనుభవిస్తున్న నరక యాతన చూసి ఎంతో ఆవేదనతో ఈ బహిరంగ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేదనడానికి బాలుడి సజీవ దహనం పెద్ద ఉదాహరణ అని చెప్పారు. తండ్రి లేని ఆ కుటుంబంలో తన సోదరికి అండగా ఉండడమే ఆ బాలుడు చేసిన తప్పా అని ప్రశ్నించారు. మహిళలపై వేధింపులు జరుగుతుంటే కఠిన చర్యలు తీసుకోని జగన్ రెడ్డి ప్రభుత్వ విధానాలు ఇలాంటి ఘటనలకు ఊతం ఇవ్వడం నిజం కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డ జోలికి వెళ్లాలంటే భయపడే పరిస్థితి రాష్ట్రంలో ఉండుంటే....అక్కకు అండగా నిలిచిన ఆ బాలుడి ప్రాణాలు పోయేవి కాదని తెలిపారు. బలహీన వర్గాలకు చెందిన ఆ బాలుడిని ఇలా మంటల్లో కాల్చేసింది వైసీపీ ప్రభుత్వ వైఫల్యమే అని ధ్వజమెత్తారు.
సూసైడ్ నోటును తారుమారు: రాష్ట్రంలో ప్రైవేటు ఆస్తుల కబ్జా నిత్యకృత్యం అయ్యిందని దుయ్యబట్టారు. దశాబ్దాల పాటు శ్రమించి ప్రజలు సంపాదించుకున్న ఆస్తిని వైసీపీ రాక్షసులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. అనంతపురంలో తన ఆస్తిని ఆక్రమించుకుంటే ప్రింటింగ్ ప్రెస్ యజమాని వంశీ...కబ్జా దారులను ఎదుర్కొనలేక ప్రాణాలు తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ అక్రమార్కుల సెటిల్మెంట్లు, ప్రజల ఆస్తుల కబ్జాలు, బెదిరింపులు, వేధింపులకు ఈ ఘటన సాక్ష్యంగా నిలుస్తోందని మండిపడ్డారు. చివరికి అతను రాసిన సూసైడ్ నోటును కూడా తారుమారు చేశారని ఆరోపించారు. సూసైడ్ లేఖలో ప్రస్తావించిన వైసీపీ నేత పేరును తొలగించిన పోలీసులు... ఆ కుటుంబానికి మరింత ద్రోహం చేశారని విమర్శించారు.
విశాఖ కిడ్నాప్ వ్యవహారం: రాష్ట్రంలో కింది స్థాయి వార్డు మెంబర్ నుంచి రాష్ట్ర మంత్రుల వరకు వ్యవహరిస్తున్న తీరు ప్రజలకు అసహ్యాన్ని కలిగిస్తోందని లేఖలో ఆక్షేపించారు. అమలాపురంలో మున్సిపల్ చైర్మన్ పై ఏకంగా వైసీపీ కౌన్సిలర్ భర్త దాడికి దిగడం ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరుకు అద్దం పడుతోందని మండిపడ్డారు. విశాఖలో జరిగిన కిడ్నాప్ వ్యవహారం రాష్ట్రంలో అధ్వాన్న శాంతి భద్రతలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు పెంచి పోషించిన గూండాలే ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేశాయన్నారు. ఈ నాలుగు ఘటనలు కేవలం మూడు రోజుల వ్యవధిలో జరిగాయంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించాలన్నారు.
రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన: సీఎం ఇంటి సమీపంలోనే గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్ముతున్నారని, మరోవైపు (జ)గన్ కల్చర్ ప్రజలను భయకంపితులను చేస్తోందని దుయ్యబట్టారు. గన్ తో సెటిల్‌మెంట్లు అనే విష సంస్కృతి జగన్ రెడ్డి పాలనకు ట్రేడ్ మార్క్ అయ్యిందని లేఖలో మండిపడ్డారు. అక్రమ అరెస్టులు, కేసులు, కస్టోడియల్ టార్చర్ ద్వారా రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన తీవ్రంగా జరుగుతోందని అమెరికా విదేశాంగ శాఖ తన నివేదికలో చెప్పిందని గుర్తుచేశారు. ఎన్సీఆర్బీ నివేదికలు కూడా రాష్ట్రంలో పెరుగుతున్న క్రైం రేటును సూచిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో జరిగిన ఏ ఒక్క దారుణంపై కూడా ముఖ్యమంత్రి ఇప్పటి వరకు స్పందించలేదని మండిపడ్డారు. తన ఇంటి సమీపంలో గ్యాంగ్ రేప్ జరిగినా.... తన ఇంటి పక్కనే బాలిక హత్య జరిగినా కూడా ముఖ్యమంత్రి స్పందించపోవడాన్ని ఏమనుకోవాలని నిలదీశారు. తీవ్రమైన నేరాలు జరిగిన సందర్భంలో ప్రభుత్వ పెద్దలు స్పందిస్తే అధికార యంత్రాంగంలో బాధ్యత పెరుగుతుంది, కదలిక వస్తుందన్నారు. కానీ ఆ దిశగా సిఎం నాలుగేళ్లలో ఒక్క సారి కూడా పనిచేయలేదని విమర్శించారు.