CBN Penna To Vamsadhara Tour on August 1st : 'పెన్నా టు వంశధార' పేరుతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 1 నుంచి పది రోజుల పాటు ప్రాజెక్టుల సందర్శన చేపడతారని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు. కొన్ని ప్రాజెక్టులను ప్రీక్లోజర్ చేసేసిన విధానాన్ని ప్రజలకు వివరిస్తారన్నారు. అమరావతి ఎన్టీఆర్ భవన్‌లో అచ్చెన్నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు చేపట్టే 'పెన్నా టు వంశధార' కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా చూడొద్దని, ప్రజా అవగాహన కార్యక్రమంగా చూడాలని ఆయన కోరారు. జగన్ సహా మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు దోపిడీనే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. వ్యవసాయ, సాగునీటి రంగాలను జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. అన్నపూర్ణగా పేరొందిన ఏపీలో వ్యవసాయం, సాగునీటి రంగాలను జగన్ భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు.
ప్రభుత్వాన్ని తాము ప్రశ్నిస్తే ఎదురు దాడి చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు బీజం పడిందని, దాన్ని చంద్రబాబు కంటిన్యూ చేస్తున్నారని గుర్తు చేసారు. ఇరిగేషన్ రంగాన్ని ప్రభుత్వం ఎలా గాలి కొదిలేసిందో చంద్రబాబు ఇప్పటికే వివరించారని, మరోసారి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా ప్రజల్లో అవగాహన కలిగిస్తారని వెల్లడించారు. 2014-19 మధ్య కాలం ఇరిగేషనుకు స్వర్ణ యుగమని పేర్కొన్నారు. జగన్ చెప్పేవన్నీ అబద్దాలేనని ఆక్షేపించారు. ప్రస్తుతం ఇంకేం ఖర్చు పెడతారని, వర్షా కాలంలో ప్కాజెక్టులకు ఖర్చు పెట్టడం సాధ్యమా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
పడకేసిన ప్రాజెక్టులు-ప్రజా ద్రోహి జగన్ : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో మొత్తం 198 జలవనరుల ప్రాజెక్టులు ప్రీక్లోజర్ చేస్తే అందులో 96 ప్రాజెక్టులు కోస్తాంధ్రలో ఉన్నాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రాజెక్టు గేట్లకు కనీసం గ్రీజ్ కూడా ఈ ప్రభుత్వం పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండు రోజుల క్రితం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో 'పడకేసిన ప్రాజెక్టులు-ప్రజా ద్రోహి జగన్' పేరిట ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ప్రదర్శించారు.
ఏపీలోని 69 నదుల అనుసంధాన ప్రక్రియ పూర్తి అయితే.. నీటి సమస్యే ఉండదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళి ప్రధాన నదులని.. వీటి కింద అనేక నదులు ఉన్నాయని అన్నారు. ఉత్తరాంధ్రలో నదులను అనుసంధానం చేసేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు చేపట్టామని గుర్తు చేశారు. వంశధార-గోదావరి నదులను అనుసంధానం చేయొచ్చని.. కానీ, వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోస్తాంధ్ర ప్రాజెక్టులపై టీడీపీ హయాంలో 21,442 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, వైసీపీ ప్రభుత్వం కేవలం 4375 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారన్నారు. టీడీపీ హయాంలో మొత్తంగా 64 ప్రాజెక్టులు మొదలెట్టి 23 పూర్తి చేశామని ఆయన గుర్తు చేశారు. ఈ నాలుగు సంవత్సరాలల్లో 4 శాతం ప్రాజెక్టు పనులే చేయటం సిగ్గనిపించడం లేదా అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రాజెక్టులను కాలపరిమితి పెట్టుకుని పని చేస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.