Chandrababu Naidu meets iTDP activists: అవినాష్ రెడ్డి అరెస్టు వ్యవహరం కోర్టులో చెప్పారు కాబట్టే బయటకు వచ్చిందని.. అంత దాచాల్సిన అవసరం ఎందుకనీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిలదీశారు. అమరావతి ఎక్కడికీ పోదు అన్న ఆయన.. 9నెలల తర్వాత మళ్లీ పరిగెత్తిస్తామని తెల్చిచెప్పారు. మంత్రులు శాఖాపర అంశాలు వదిలి తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల్లోకి విసృత్తంగా తీసుకువెళ్లే బాధ్యత సామాజిక మాధ్యమ కార్యకర్తలయిన ఐటీడిపీదేనన్న చంద్రబాబు వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో కౌరవ వద తప్పదని హెచ్చరించారు.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఆ పార్టీ సామాజిక మాధ్యమ విభాగం (ఐటీడీపీ) కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. వైసీపీ నేతలు నోరుంది కదా అని ఆంబోతుల్లా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.భవిష్యత్తులో జరిగేది క్లాస్ వార్ కాదు అని.. క్యాష్ వార్ అని స్పష్టం చేశారు. దోపిడీని అరికట్టడమే లక్ష్యంగా పని చేస్తామని తేల్చిచెప్పారు. కొందరు పోలీసులు వైసీపీ చెప్పిన విధంగా చేస్తూ నకిలీ పోలీసుల్లా మారారని విమర్శించారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే నిజమైన పోలీసులు వస్తారన్నారు.
మంత్రుల శాఖలను ఉద్దేశించి చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అక్రమ మైనింగ్ చేసేవాడు మైనింగ్ మంత్రిగా ఉన్నారని దుయ్యబట్టారు. సొంత ఊర్లో పిల్ల కాలువ తవ్వలేని వాడు జలవనరుల మంత్రి అని, తన నియోజకవర్గంలో 10ఇళ్లు కట్టలేనివాడు గృహనిర్మాణ శాఖ మంత్రిగా పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడులు గురించి అడిగితే కోడి గుడ్డు గురించి చెప్పేవాడు పరిశ్రమల శాఖ మంత్రి అని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డికి కోర్టులో అనుకూల తీర్పులు రావాలని యాగాలు చేసేవాడు దేవాదాయ శాఖ మంత్రా అని మండిపడ్డారు. రైతు బజార్లు కూడా తాకట్టు పెట్టి అప్పులు చేసేవాడు ఆర్థిక శాఖమంత్రిగా ఉన్నారని ఆక్షేపించారు. పిల్లల జీవితాలు నాశనం చేసేవాడు విద్యాశాఖ మంత్రి అని దుయ్యబట్టారు.
ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు.. అభద్రతకు గురవుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం అవసరమన్నారు. ఆడబిడ్డల జీవితాల్లో వెలుగు తేవాలనేదే తన లక్ష్యమని చంద్రబాబు వెల్లడించారు. నిరుద్యోగ భృతి ఇస్తామని గతంలో చెప్పి.. అమలు చేశామని గుర్తు చేసిన ఆయన.., మళ్లీ అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన చేపడతామన్నారు. పేదలు ధనికులుగా మారడం నష్టం లేని వాళ్లే పూర్ టు రిచ్ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ కార్యకర్తలు చేసే ప్రచారం ఎంత ముఖ్యమో.. సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడం కూడా అంతే ముఖ్యమన్నారు.
ఐటీడీపీ కార్యకర్తలను చూస్తే జగన్మోహన్ రెడ్డికి వణుకు పుడుతుందని, వైసీపీ అధికారబలం, ధనబలం వారి చిన్న పోస్టులకు భయపడిపోతోందని చంద్రబాబు మండిపడ్డారు. అధికార పార్టీ కోట్లు కుమ్మరించినా చేయలేని పనిని పార్టీపై ప్రేమతో, సృజనాత్మకతతో ఐటీడిపి కార్యకర్తలు చేస్తున్నారన్నారు. ఐటీడీపీకి వైసీపీ భయపడింది కాబట్టే అక్రమ కేసులు, నోటీసులతో వేధించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు, నోటీసులను ఐటీడీపీ ఎప్పుడో దాటేసిందన్నారు. నిలిచిపోయిన ప్రాజెక్టులు, దెబ్బతిన్న రోడ్లు, పూర్తికాని ఇళ్లు వంటివి ఒక్క ఫొటో పోస్టుతో ప్రజల్ని చైతన్నపరుస్తున్నారని అభినందించారు. జగన్ ఆలోచన సొంత సంపద గురించి అయితే.., తమ ఆలోచనలు రాష్ట్ర సంపద గురించి అని చంద్రబాబు తెలిపారు. కసితో ఐటీడీపీ చేసే పనికి పేటీఎం బ్యాచ్ పారిపోవటం ఖాయమని ఎద్దేవా చేశారు. 34వేల మంది ఐటీడీపీయన్లే తెలుగుదేశం పార్టీకి రిపోర్టర్లు, ఎడిటర్లు, మీడియా యజమానులు అని చెప్పారు.
'అక్రమ మైనింగ్ చేసేవాడు మైనింగ్ మంత్రిగా ఉన్నారు. సొంత ఊర్లో పిల్ల కాలవ తవ్వలేని వాడు జలవనరుల మంత్రి. తన నియోజకవర్గంలో 10ఇళ్లు కట్టలేనివాడు గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు. పెట్టుబడులు గురించి అడిగితే కోడి గుడ్డు గురించి చెప్పేవాడు పరిశ్రమల శాఖ మంత్రి. జగన్మోహన్ రెడ్డికి కోర్టులో అనుకూల తీర్పులు రావాలని యాగాలు చేసేవాడు దేవాదాయ శాఖ మంత్రి. రైతు బజార్లు కూడా తాకట్టు పెట్టి అప్పులు చేసేవాడు ఆర్థిక శాఖమంత్రి గా ఉన్నాడు. పిల్లల జీవితాలు నాశనం చేసేవాడు విద్యాశాఖ మంత్రి'- చంద్రబాబు,తెలుగుదేశం అధినేత