"దళితులపై రాళ్లదాడి.. జగన్ రెడ్డి ఫ్యాక్షన్ పాలనకు నిదర్శనం" అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పంచాయితీ ఎన్నికల్లో పోటీచేస్తే చంపేస్తామంటూ గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం లింగాపురం గ్రామంలో ఎస్సీలపై దాడి చేయటాన్ని ఖండిస్తున్నామన్నారు. వైకాపా నేతల దాడి ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని విమర్శించారు. దళితులు రాజకీయాల్లోకి వచ్చి పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయకూడదా అని చంద్రబాబు నిలదీశారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా పోటీచేసే హక్కు ప్రతిఒక్కరికీ ఉందని జగన్ రెడ్డి గుర్తించాలని హితవు పలికారు.
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితుల్లోనూ.. ప్రజామద్దతు తమకు ఉందని వైకాపా చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. గ్రామాల మీదకు గూండాలను వదిలి బడుగు బలహీన వర్గాలపై దాడులకు దిగటం, ఇళ్లకు వెళ్లి బెదిరించటంతో పాటు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అత్యంత హేయమని మండిపడ్డారు. "కులం పేరుతో దూషించి, రాళ్లతో దాడి చేసిన వైకాపా నేతలపై ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడం నీరుగారిన పోలీసు వ్యవస్థ పనితీరుకు నిదర్శనం" అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: