Chances to CRDA Housing Project will remain worthless Asset: ఎన్నికలకు ముందు మంచి రాజధానిని కడతానని మాటిచ్చి గెలిచిన జగన్ తర్వాత మడమ తిప్పారు. అధికారంలోకి వస్తూనే అమరావతి నిర్మాణ పనులను నిర్దాక్షిణ్యంగా నిలిపేశారు. ఇందులో భాగంగా శరవేగంగా సాగుతున్న హౌసింగ్ ప్రాజెక్టు నిర్మాణానికి బ్రేకులు వేశారు. ఇది జరిగి నాలుగున్నరేళ్లు అవుతోంది. ఇంత వరకు పనులు మొదలు కాలేదు.
ఇదే ఇప్పుడు సీఆర్డీఏ పాలిట శాపంగా మారబోతోంది. నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉన్నా జగన్ సర్కారు వైఖరి కారణంగా సీఆర్డీఏ రుణ సంక్షోభంలో కూరుకుపోనుంది. పెంచిన గడువు కూడా మరో రెండు నెలల్లో పూర్తవుతుంది. అప్పటికీ నిర్మాణాలు పూర్తి కాకపోతే ప్రాజెక్టును నిరర్థక ఆస్తిగా బ్యాంకులు ప్రకటించే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే అమరావతి బాండ్లకు ఏజెన్సీలు రేటింగ్ తగ్గించడంతో వైసీపీ ప్రభుత్వ ప్రతిష్ఠ మసకబారింది. దీనికి తోడు రుణం చెల్లించక నిరర్థక ఆస్తిగా గుర్తిస్తే రాజధాని నిర్మాణం, సీఆర్డీఏపై తీవ్రమైన ప్రభావం పడనుంది.
విభజన తర్వాత ఏపీ పాలనా యంత్రాంగం అన్ని ప్రభుత్వ శాఖలతో వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో కొలువుదీరింది. ఇక్కడ పనిచేసే 2,500 మంది ఉద్యోగులకు ప్రభుత్వ నివాసాలు లేక విజయవాడ, గుంటూరు, మంగళగిరిలో ఉండాల్సి వచ్చింది. దీంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం వివిధ స్థాయుల అధికారులు, ఉద్యోగుల అవసరాల దృష్ట్యా రాజధానిలో బహుళ అంతస్తుల భవన సముదాయాల నిర్మాణాన్ని ప్రారంభించింది.
"అమరావతిపై.. అదే అక్కసు".. ఈ ఏడాది బడ్జెట్‌లోనూ మొండిచెయ్యి
అఖిల భారత సర్వీసు అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, గెజిటెడ్, నాన్-గెజిటెడ్ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగులు ఇక్కడ నివాసం ఉండేందుకు వీలుగా అంతర్జాతీయ ప్రమాణాలతో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాన్ని ప్రారంభించింది. మొదటి విడతలో 2,500 కోట్ల అంచనా వ్యయం అయ్యే ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీతో యూబీఐ లీడ్ బ్యాంకుగా ఉన్న కన్సార్షియం నుంచి సీఆర్డీఏ 2,060 కోట్ల రుణం తీసుకుంది.
ప్రభుత్వ తీసుకున్న రుణంలోని మొత్తంలో 1,860 కోట్లు విడుదలైంది. మిగిలిన 500 కోట్లు ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంది. 92లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మొత్తం 3,840 యూనిట్లతో మొదలైన నిర్మాణ పనులు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి.
అమరావతిపై ఎందుకంత అక్కసు?.. అప్పుడు రాజధాని.. ఇప్పుడు స్మార్ట్ సిటీ
వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి రాగానే నిర్మాణ పనులన్నీ ఆగిపోయాయి. ఇవి తిరిగి ప్రారంభం కాలేదు. దీంతో పనులు దక్కించుకున్న ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ, నాగార్జున కన్‌స్ట్రక్షన్స్ సంస్థల సిబ్బంది కూడా తరలిపోయారు. ఆ తర్వాత అమరావతిపై జగన్ అక్కసుతో ఉద్యోగుల హౌసింగ్ ప్రాజెక్టు పనులు 2019 జూన్ నుంచి నిలిచిపోయాయి.
అప్పటి వరకు ప్రాజెక్టుకు 1,300 కోట్లు వెచ్చించారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన 500 కోట్లు ఇంత వరకు సీఆర్డీఏకు జమ చేయలేదు. మరోవైపు తన వాటాను ప్రభుత్వం ఇవ్వకపోగా బ్యాంకులు ఇచ్చిన రుణాన్ని కూడా నొక్కేసింది. సీఆర్డీఏ ఖాతా నుంచి జగన్ ప్రభుత్వం 500 కోట్లు లాగేసుకుంది. ఈ మొత్తాన్ని కూడా తిరిగి ఇవ్వలేదు.
బ్యాంకులకు సమర్పించిన ప్రతిపాదనల మేరకు ఈ ఏడాది ప్రథమార్థంలోగా అధికారులు, ఉద్యోగుల హౌసింగ్ ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంది. పది నెలల క్రితం సీఆర్డీఏ కార్యాలయానికి వచ్చిన బ్యాంకు అధికారుల బృందానికి చాలా మంది ఉద్యోగులు ఈ అపార్ట్‌మెంట్లలో నివాసం ఉంటున్నారని, 2024 ఫిబ్రవరి ఆఖరుకు పూర్తి చేసి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభిస్తామని సీఆర్డీఏ అధికారులు నమ్మబలికారు.
రాజధాని భూముల అమ్మకం.. 15 ఎకరాల విక్రయానికి అనుమతి
సీఆర్డీఏ అధికారులు నమ్మబలికిన గడువు ముంచుకొస్తోంది. ఇచ్చిన హామీ ప్రకారం రానున్న రెండు నెలల్లో బహుళ అంతస్తుల భవనాలు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాల్సి ఉంది. బ్యాంకు నిబంధనల ప్రకారం ఒక ప్రాజెక్టు నిమిత్తం రుణం తీసుకుని, దానిని పూర్తి చేయకపోతే నిరర్థక ఆస్తిగా పరిగణిస్తారు. ఇది దివాలా తీసిన పరిస్థితితో సమానం.
ఇకపై ఈఎంఐలకు బదులు ఏకమొత్తంలో రుణాన్ని చెల్లించాలి. భవిష్యత్తులో రుణాలు పొందే పరిస్థితి ఉండదు. రెండు నెలల్లో నిర్మాణాలు పూర్తి కావు, ప్రస్తుత పరిస్థితుల్లో అంతమొత్తం ఒకేసారి చెల్లించడం కూడా అసాధ్యమే. ముఖ్యమంత్రి జగన్ పుణ్యమా అని సీఆర్డీఏ రుణ సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఏర్పడింది.
Legal Notice to CRDA: సీఆర్డీఏకు 28 మంది లీగల్ నోటీసులు ఎందుకంటే?