CENTRAL TEAM:కొత్త త్రిప్స్ కారణంగా రాష్ట్రంలో మిర్చి పంటకు తీవ్ర నష్టం కలుగుతోందని ఎంపీ జీవీఎల్ నరసింహరావు తెలిపారు. కొత్తరకం త్రిప్స్ కారణంగా ఆహార భద్రతకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆయన అన్నారు. మిర్చికి జరిగిన నష్టంపై పరిశీలించేందుకు వచ్చిన నిపుణుల బృందంతో ఆయన గుంటూరులోని సుగంధద్రవ్యాల బోర్డు కార్యాలయంలో సమావేశమయ్యారు.
కేంద్ర ప్రభుత్వ అధికారులు, బెంగళూరు ఐఐహెచ్ఆర్ నిపుణులు, వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాష్ట్ర ఉద్యాన శాఖ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. వాతావరణ పరిస్థితులు, అధిక వర్షాలు, త్రిప్స్ ను నియంత్రించే మిత్ర పురుగులు చనిపోవటం కారణాలు కావొచ్చని అధికారులు జీవీఎల్ కు వివరించారు.
అయితే క్షేత్రస్థాయిలో పర్యటించి అన్ని కోణాల్లో పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను కోరినట్లు జీవీఎల్ తెలిపారు. మిర్చి తో పాటు ఇతర పంటల్లోనూ ఈ త్రిప్స్ ప్రభావం ఉందన్నారు. మనుషులకి కరోనా తరహాలో... పంటలకు ఈ త్రిప్స్ ప్రమాదంగా పరిణమించాయని అభిప్రాయపడ్డారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చే అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందన్న ఆయన.. రాష్ట్రంలో విపత్తు నిర్వహణ నిధుల నుంచి పరిహారం ఇవ్వొచ్చని సూచించారు. వారి వద్ద సరైన నిధులు లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ నిధులు కోరాలన్నారు. తాము కూడా కేంద్ర హోం శాఖతో మాట్లాడి వీలైనంత సాయం వచ్చేలా చేస్తామని తెలిపారు. గుంటూరు ప్రకాశం జిల్లాల్లో నిపుణుల బృందం పర్యటించి మిర్చి పంటను భవిష్యత్తులో కాపాడేందుకు ఏం చేయాలనేది నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: