Polavaram Project Construction Progress : పోలవరం పనులు ఏడాదిలో కేవలం 0.83శాతం మేర సాగినట్లు కేంద్ర జల్‌శక్తి శాఖ వార్షిక నివేదిక వెల్లడిస్తోంది. తాజాగా విడుదలైన 2022-23 వార్షిక నివేదిక ప్రకారం.. గతేడాది నవంబరు నాటికి మొత్తం ప్రాజెక్టు పనులు 78.64శాతం మేర జరిగాయి. అంతకు ముందు ఏడాది నవంబరు నాటికి పూర్తయిన 77.81శాతం పనులతో పోలిస్తే.. 12నెలల్లో కేవలం 0.83శాతం మాత్రమే పనుల్లో పురోగతి ఉంది. ప్రాజెక్టు అంచనా వ్యయంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. 2019 ఫిబ్రవరి 11న జరిగిన 141వ సలహా కమిటీ సమావేశంలో.. 55 వేల 548 కోట్ల 87 లక్షల రూపాయలకు సవరించిన అంచనా వ్యయాన్ని కేంద్ర జల్‌శక్తిశాఖ ఆమోదించింది. సలహా కమిటీ ఆమోదం పొందిన తర్వాత ప్రాజెక్టు అంచనా వ్యయం పెరుగుదలను పరిశీలనకు జల్‌శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో రివైజ్డ్‌కాస్ట్ కమిటీ ఏర్పాటైంది. దీనిని 2019 ఏప్రిల్ 2న ఏర్పాటు చేశారు. 2020 మార్చి 17న ఆ కమిటీ జల్‌శక్తి శాఖకు సమర్పించిన నివేదికలో.. 2017-18 ధరల ప్రకారం ప్రాజెక్టు వ్యయాన్ని 47వేల 725 కోట్ల 74లక్షల రూపాయలకు సిఫార్సు చేసింది. సలహా కమిటీ ఆమోదించిన రెండో సవరించిన అంచనాతో పోలిస్తే ఈ కమిటీ సిఫార్సు చేసిన మొత్తం 7వేల 823 కోట్ల 13లక్షల రూపాయలు తక్కువ. దీన్ని ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు. ఈ అంశం అనిశ్చితిగానే మిగిలినట్లు తాజా వార్షిక నివేదిక వెల్లడిస్తోంది.
పునరావాస కాలనీల నిర్మాణంలో పురోగతి శూన్యం : పోలవరం పునరావాస కార్యక్రమాల్లోనూ పెద్దగా పురోగతి లేదు. తొలిదశలో ముంపునకు గురయ్యే ప్రాంతంలో మొత్తం 75 కాలనీలు నిర్మించాల్సి ఉండగా.. 2021-22 నాటికి 26 పూర్తయ్యాయి. 2022-23 సంవత్సరంలో ప్రకటించిన వార్షిక నివేదికలో కూడ 26 కాలనీలే పూర్తైనట్లు వెల్లడైంది. అంటే సంవత్సరంలో ఒక్క కాలనీ కూడా పూర్తి కాలేదని తెలుస్తోంది. తొలిదశ కింద ప్రభావిత మండలాల సంఖ్య ఇది వరకు 5 ఉండగా.. 2022-23 నాటికి ఆరుకు పెరిగింది. అంతేకాకుండా ప్రభావిత ఆవాస ప్రాంతాల సంఖ్య 115 ఉండగా అది 123కి చేరుకుంది. కొత్తగా ఒక్క పునరావాస కాలనీ నిర్మించకపోగా అంతకముందే నిర్మించిన పునరావాస కాలనీలోకి కొత్తగా 13 ఆవాస ప్రాంతాలను తరలించగా.. ఆవాస ప్రాంతాల సంఖ్య 25నుంచి 38కి పెరిగింది. అలాగే తరలించిన నిర్వాసిత కుటుంబాల సంఖ్యా 6వేల 351 నుంచి 11వేల 521కి పెరిగింది. దీంతో ఇంకా తరలించాల్సిన నిర్వాసిత కుటుంబాల సంఖ్య 16వేల 663 నుంచి 9,425కి తగ్గింది. ఇదంతా కేవలం తొలిదశ ముంపు ప్రాంతం వరకే.
ఏడాదిలో 5 శాతం మాత్రమే : రెండో దశ ముంపు ప్రాంతంలో గతేడాది నుంచి పురోగతి లేదు. కొత్తగా పునరావాస కాలనీలు నిర్మించకపోయినా ఇప్పటికే నిర్మించిన వాటిలోకి ముంపు ప్రాంత ఆవాసాలు, ముంపు బాధిత కుటుంబాల తరలింపులో కొంత పురోగతి కనిపించింది. దీనివల్ల భూసేకరణ, సహాయ పునరావాస పనులతో కలుపుకొని బేరీజు వేస్తే.. పూర్తయిన మొత్తం పనులు 42.56శాతం నుంచి 48.04శాతానికి చేరాయి. అంటే ఏడాదిలో 5.48శాతం మేర పురోగతి నమోదైంది. 2022 నవంబరు నాటికి ప్రాజెక్టు నిర్మాణానికి 20 వేల736 కోట్ల31 లక్షల రూపాయలు వెచ్చించినట్లు జల్‌శక్తి శాఖ తెలిపింది. 2019 నవంబరు నాటికి ఖర్చయిన 16వేల538 కోట్ల 79 లక్షలను మినహాయిస్తే.. మూడేళ్లలో చేసిన ఖర్చు 4వేల197 కోట్ల52లక్షలు మాత్రమే.
ఇవీ చదవండి :