భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ)ను మోసగించారన్న ఆరోపణలపై గుంటూరు మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకటరావు, ఆయన సోదరుడు మురళీమోహన్‌తోపాటు వారి కంపెనీ ఇండ్ టోబ్ ఇంటర్నేషనల్ ప్రైవేటు లిమిటెడ్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. తనఖాగా పెట్టిన చరాస్తుల వాస్తవ విలువను అనేక రెట్లు పెంచి చూపించి ఎస్‌బీఐకి రూ.19.28 కోట్ల మేర నష్టం కలిగించారన్న ఫిర్యాదుపై ఈ కేసు నమోదైంది. నేరపూరిత కుట్ర, ఫోర్జరీ, నేరపూరిత విశ్వాసఘాతుకం, నేరపూరిత దుష్ప్రవర్తన తదితర అభియోగాలపై వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు.
‘పొగాకు వ్యాపారం కోసం గుంటూరు కేంద్రంగా 2009 అక్టోబరు 15న ఇండ్ టోబ్ ఇంటర్నేషనల్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఏర్పాటైంది. దానికి తాడిశెట్టి వెంకటరావు ఎండీ కాగా, ఆయన సోదరుడు మురళీమోహన్ డైరెక్టర్. ఈ కంపెనీ మాతృసంస్థ అయిన ఎథ్నిక్ టొబాకో ఇండియా లిమిటెడ్‌కు పొగాకు సరఫరా చేసేందుకు దీన్ని ఏర్పాటుచేశారు. వ్యక్తిగత పూచీకత్తుల కింద చరాస్తుల్ని చూపించి గుంటూరులోని ఎస్‌బీఐ నుంచి వీరు రుణాలు తీసుకున్నారు. ఆ తర్వాత ఇది నిరర్థక ఖాతాగా మిగిలింది. 2020 సెప్టెంబరు 30నాటికి ఈ సంస్థ బ్యాంకుకు రూ.61.08 కోట్ల మేర బకాయి పడింది. హామీగా ఇచ్చిన ఆస్తుల విలువ రూ.43.29 కోట్లు మాత్రమే. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐకి రూ.19.28 కోట్ల మేర నష్టం కలిగించారన్న ఫిర్యాదుపై కేసు నమోదు చేశాం’ అని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.
ఇదీ చదవండి:
schools reopen: ఆగస్టు 16 నుంచి బడులు... అంగన్‌వాడీల నుంచే ఆంగ్ల మాధ్యమం!
Corona Third Wave threat: పొంచి ఉన్న మూడో ముప్పు.. ముందే మేల్కొలుపు!