మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంతంలో రైతుల నిరసనలు, ధర్నాలు, దీక్షలు కొనసాగుతున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, రాయపూడిలో 91వ రోజూ ఆందోళనలు హోరెత్తాయి. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు, వారి కుటుంబీకులు దీక్షల్లో పాల్గొన్నారు. వినూత్న రూపాల్లో ఆందోళన చేపట్టారు. రాయపూడిలో మహిళలు నోటికి ప్లాస్టర్లు ధరించి నిరసన తెలిపారు. తుళ్లూరులో అమరావతి వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ సర్వమత ప్రార్ధనలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాజధాని లేని పరిస్థితుల్లో తాము భూములిస్తే.... వాటిని ఇష్టానుసారంగా తవ్వేసి.. ఎందుకూ పనిరాకుండా చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రభుత్వం చెబుతోందని...వాటితో ఏం చేసుకోవాలో తెలియటం లేదంటున్నారు. డ్రోన్ కేసులో విడుదలైన మహిళలు సైతం మందడం శిబిరానికి వచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా పోరాటం ఆపబోమని చెబుతున్నారు.
రాజధాని అమరావతిని ఎవరూ అంగుళం కూడా కదల్చలేరని మాజీమంత్రి దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. న్యాయపోరాటంలో రాజధాని మహిళలదే అంతిమ విజయమని పేర్కొన్నారు. తుళ్లూరు దీక్షా శిబిరానికి వచ్చిన ఆయన... రైతుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. జగన్ నియంతలా మారి.. కులాల పేరుతో సమాజాన్ని విడదీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
స్థానిక ఎన్నికలను వాయిదా వేసినందుకే జగన్ అంత బాధపడిపోతుంటే... రాజధాని కోసం భూములిచ్చి... రోడ్డున పడిన తమ పరిస్థితి ఏంటని మహిళలు ప్రశ్నిస్తున్నారు.
ఇదీచదవండి