వైకాపా పాలనపై రాష్ట్ర భాజపా నేతలు మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధికి బదులు, అవినీతి, అప్పులు కనిపిస్తున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, వైకాపా తమవిగా ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. ప్రధాని సడక్, నాబార్డ్, తదితర వేలాది కోట్ల నిధులతో ఫోర్ వే, సిక్స్ వే, వంతెనలు, రహదారులు నిర్మిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం కనీసం రోడ్లపై గోతులను కూడా పూడ్చకపోవడం వారి అసమర్ధతకు నిదర్శనమని దుయ్యబట్టారు. రాష్ట్రానికి తాము చెయ్యవలసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ విజయవంతంగా నిర్వహిస్తుంటే.. అన్నీ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఏమీ చేయకుండా, రాజధానిని తరలిస్తూ దుర్మార్గ పాలన చేస్తున్నాడని సోము వీర్రాజు ధ్వజమెత్తారు.
ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా కృష్ణాజిల్లా గుడివాడలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో సోము వీర్రాజు పాల్గొన్నారు. పట్టణంలోని కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రం, రేషన్ షాపులను పరిశీలించారు.
ఒక ప్రజాప్రతినిధి రెండు లక్షల మందికి ఆదర్శం...
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రెండుసార్లు విద్యుత్ చార్జీలు పెంచారని భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పెంచిన ఛార్జీలు పేదలకు పెనుభారంగా మారాయని ఆవేదన చెందారు. ట్రూ అప్ చార్జీల పేరుతో పేదల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే విద్యుత్ చార్జీలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు దిగజారి ప్రవర్తిస్తున్నాయని.. రాజకీయ నాయకుడికి భాష, ప్రవర్తన ముఖ్యం అని మొదటి నుంచి చెప్తున్నామన్నారు. శుక్రవారం తాడేపల్లిలో వైకాపా, తెదేపా నేతలు దుర్భాషలాడుకోవడం.. ఒకరిపైన మరొకరు దాడులు చేసుకోవడం రాష్ట్ర ప్రజలందరూ గమనించారన్నారు. ఒక ప్రజాప్రతినిధి రెండు లక్షల మందికి ఆదర్శంగా ఉంటారని.. అటువంటి ప్రజాప్రతినిధులు దిగజారి ప్రవర్తించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. రాబోయే రోజుల్లో భాజపాని గెలిపిస్తే ప్రజలకు మంచి పాలన అందిస్తామని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
గుంటూరు కన్నావారి తోటలోని చౌకధర దుకాణాలను ఆయన పరిశీలించారు. చౌక దుకాణాల వద్ద మోదీ బొమ్మలు ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి : viveka case: హత్యకు వాడిన ఆయుధాలపై ఆరా.. దస్తగిరిని కూడా పిలిచిన అధికారులు