రొమ్ము క్యాన్సర్‌పై ఉదాసీనంగా వ్యవహరించడానికి వీలు లేదంటున్న గుంటూరు వైద్య కళాశాల(జీఎంసీ) పూర్వ విద్యార్థి, నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్(చికాగో-అమెరికా) కన్సల్టెంట్ సర్జికల్ పెథాలజిస్ట్ ఆచార్య సాంబశివరావుతో ప్రత్యేక ముఖాముఖి.
ప్రశ్న: వంశంలో ఒకరికి రొమ్ము క్యాన్సర్ ఉంటే జన్యుపరంగా ఇతరులకు వస్తుందా?
జవాబు: రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్న వారిలో చాలామందికి ఎలాంటి జన్యుపరమైన చరిత్ర ఉండటం లేదు. అయితే రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్న వారిలో 7-10 శాతం మందికి వంశంలో అతి దగ్గరి రక్త సంబంధీకులకు ఆ చరిత్ర ఉంటోంది. వంశంలో బలమైన చరిత్ర ఉన్న వారికి జన్యుపరమైన పరీక్ష చేసి ముప్పు ఎక్కువుందా? లేదా? అన్నది తెలుసుకోవచ్చు.
ప్రశ్న: ఎందుకొస్తుందో కచ్చితంగా చెప్పగలమా?
జవాబు: కచ్చితంగా తెలుసని చెప్పలేం. కొన్నికొన్ని కారణాల వల్ల ఈ వ్యాధి ముప్పు పెరుగుతుందని ఇప్పుడు చెప్పగలుగుతున్నాం. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం తినడం. దీర్ఘకాలం హార్మోన్ మాత్రలు వాడటం. పొగ, మద్యం తాగటం. శారీరక బరువు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉండటం.
ప్రశ్న: ఇది పెద్ద వయసు వారిలోనే వస్తుందా?
జవాబు: ఇది పూర్తి నిజం కాదు. ఏ వయసు వారిలోనైనా రావచ్చు. ఆందోళనకరమైన అంశమేమంటే మన ప్రాంతంలో చాలా కేసులు చిన్న వయసు వారిలోనే.. అంటే 50 ఏళ్ల కంటే తక్కువ వయసు వారిలోనే కనిపిస్తున్నాయి.
ప్రశ్న: రొమ్ముల్లో గడ్డ వచ్చిందంటే అది క్యాన్సరేనా?
జవాబు: ఇది వట్టి అపోహే. ఎందుకంటే రొమ్ముల్లో వచ్చే గడ్డల్లో పదిలో తొమ్మిది క్యాన్సర్ గడ్డలు కావు. అయితే అలాగని అశ్రద్ధగా ఉండిపోవడానికి లేదు. రొమ్ములకు సంబంధించి ఎలాంటి అనుమానం వచ్చినా తప్పనిసరిగా వైద్యులకు చూపించుకుని, అది క్యాన్సర్ కాదని నిర్ధారించుకోవడం చాలా అవసరం.
ప్రశ్న: స్క్రీనింగ్‌తో ముందే పట్టుకోవచ్చా?
జవాబు: ఈ వ్యాధిని ముందుగానే పట్టుకోవటానికి తేలికైన మామోగ్రామ్ పరీక్ష బాగా ఉపయోగపడుతుంది. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ మార్గదర్శకాల ప్రకారం 40 ఏళ్లు దాటిన మహిళలంతా క్రమం తప్పకుండా ఏటా ఒకసారైనా ఈ పరీక్ష చేయించుకోవాలి. కనీసం మంచి అవగాహన ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది వంటివారు రొమ్ములను చేతితో తాకి అయినా పరిశీలించడం మంచిది. ఇది మామోగ్రామ్‌కు ప్రత్యామ్నాయం కాకపోయినా.. ముందుగానే పోల్చుకోవడానికి కొంతవరకైనా తోడ్పడుతుంది. తొలి దశలోనే క్యాన్సర్‌ను గుర్తిస్తే చికిత్స తేలికవుతుంది.
ప్రశ్న: ఈ వ్యాధికి చికిత్సలు ఎలా ఉన్నాయి?
జవాబు: ఈ వ్యాధికి చికిత్సలో ఇప్పుడు విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి. ప్రతి ఒక్కరికీ అనుగుణంగా ప్రత్యేకమైన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి మంచి ఫలితాలు ఇస్తున్నాయి. అందువల్ల రొమ్ము క్యాన్సర్ అనగానే ఇప్పుడు భయపడి పోవాల్సిన పనిలేదు. నాటు వైద్యం వంటి ఇతరత్రా చికిత్సల జోలికి వెళ్లకుండా చూసుకోవాలి.
ప్రశ్న: దీనిని నివారించుకోలేమా?
జవాబు: దీనికి ప్రత్యేకమైన నివారణ చర్యలేమీ ఉండవు. క్రమం తప్పకుండా రోజూ కనీసం అరగంట వ్యాయామం చేయాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి. కొవ్వు పదార్థాలు తగ్గించాలి. తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులను సంప్రదించకుండా హార్మోన్ మాత్రలు వేసుకోవద్దు.
ఇదీ చదవండి: 'కోడిమాంసం తినడం వల్ల కరోనా రాదు'