Attacks on Minorities After YCP Came to Power: ''దాచేపల్లిలో ముస్లిం బాలికపై అత్యాచారం జరిగింది. ఈ పరిస్థితి చూస్తుంటే రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందో లేదో అర్థం కావట్లేదు. గుంటూరులో ముస్లిం అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించినవారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు ఆందోళన చేస్తుంటే వారిపై కేసులు పెట్టించారు.'' అని 2018 సెప్టెంబరు 13న విశాఖలో నిర్వహించిన ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో ప్రతిపక్ష నేత హోదాలో జగన్ చేసిన వ్యాఖ్యలివి. ముస్లింల పాలిట దీనజనోద్ధారకుడిలా వారి అభ్యున్నతి కోసమే దిగొచ్చిన మహానుభావుడిలా ప్రతిపక్ష నేత హోదాలో ఎన్నెన్నో మాటలు చెప్పిన ప్రస్తుత సీఎం జగన్.. తన ఏలుబడిలో ముస్లింలపై వరుస అరాచకాలు జరుగుతున్నా ఏమీ పట్టనట్లు ఉంటున్నారు.
ప్రతి సభలోనూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ ప్రసంగాలు గుప్పించే ముఖ్యమంత్రి అధికారపార్టీ నాయకులే ముస్లింలపై దమనకాండకు తెగబడుతున్నా కళ్లప్పగించి చూస్తున్నారు. పోలీసులు, వైసీపీ నాయకులు కుమ్మక్కై బలవన్మరణాలకు పాల్పడేంతలా ముస్లింలను వేధిస్తుంటే అసలేమీ జరగనట్లే ఉంటున్నారు. నాలుగేళ్లుగా జగన్ పాలనలో ముస్లింలపై భౌతిక దాడులు, అత్యాచారాలు, ఆస్తుల విధ్వంసం, హత్యలు వంటి ఘటనలు తీవ్రమయ్యాయి.
YSRCP anarchists: అరాచకాల అడ్డా.. నేరాల గడ్డ.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఇన్ని దారుణాలా..!
నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం పోలీసుల వేధింపులు, ఒత్తిళ్లు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. పలమనేరులో చదువుల తల్లి మిస్బా వైసీపీ నాయకుడి దాష్టీకానికి బలైపోయింది. పల్నాడు జిల్లా గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లోని వందలాది ముస్లిం కుటుంబాలపై వైసీపీ నాయకులు దాడులకు తెగబడుతూ వారిని గ్రామాల్లోకి అడుగు పెట్టనీయట్లేదు. ఇలా ఒకటా రెండా.. రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒకచోట ముస్లింలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. వాటిల్లో అత్యధిక ఘటనలకు వైసీపీ నాయకులే బాధ్యులు. మరికొన్ని ఘటనల్లో పోలీసులే వేధిస్తున్నారు. తీవ్రత ఈ స్థాయిలో ఉన్నా.. ముఖ్యమంత్రి ఒక్కరోజైనా వీటిపై సమీక్షించలేదు. ఆయా ఘటనలకు బాధ్యులైన అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోలేదు. కనీసం ఆ దారుణాలను ఖండించలేదు. దీంతో వైసీపీ నాయకులు మరింత పేట్రేగిపోతూ ముస్లింలపై దాడులకు తెగబడుతున్నారు.
Attempted Suicide Due to Harassment of YCP Leaders:
- వైసీపీ పాలనలో అధికార పార్టీ నాయకులే కాకుండా ఏకంగా పోలీసులే వేధింపులకు పాల్పడుతుండటంతో వాటిని తాళలేక వ్యక్తులు, కుటుంబాలు బలవన్మరణాలకు పాల్పడిన ఉదంతాలెన్నో. అక్రమంగా దొంగతనం కేసులు బనాయించి వేధిస్తున్నారంటూ.. నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం.. తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయే ముందు ఓ సెల్ఫీ వీడియో రికార్డు చేసి వారి ఆవేదనంతా అందులో వినిపించారు. ఆ కుటుంబాన్ని పోలీసులు ఎంతలా మానసిక క్షోభకు గురిచేశారో ఆ మాటలు వింటే అర్థమవుతుంది.
- చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన వైసీపీ కార్యకర్త సునీల్‌కుమార్ దాష్టీకం బంగారు భవిష్యత్తు కలిగిన, ముస్లిం బాలిక మిస్బాను బలితీసుకుంది. పదోతరగతిలో తన కుమార్తె స్కూల్ టాపర్‌గా నిలవాలని ఆమెకు పోటీగా ఎవరూ ఉండకూడదంటూ ఆమె కంటే బాగా చదివే, ఎక్కువ మార్కులు తెచ్చుకునే మిస్బాను అతను వేధించాడు. వార్షిక పరీక్షలు సమీపిస్తుండగా ఆ చిన్నారిని పాఠశాల నుంచి తొలగించేలా చేశాడు. తీవ్ర మనోవేదనకు గురైన మిస్బా ఆత్మహత్య చేసుకుంది. ‘‘నాన్నా! పేదలు చదువుకోకూడదా? డబ్బున్నవాళ్లే చదువుకుని ఉన్నత స్థానానికి వెళ్లాలా? నాకు మంచి మార్కులొస్తే స్నేహితురాలే ఓర్వలేకపోతోంది. నేను మళ్లీ పాఠశాలకు వెళ్లాలంటే ఆ అమ్మాయి తండ్రి అనుమతి తీసుకోవాలంటూ మా ఉపాధ్యాయుడు వేధిస్తున్నారు’’అంటూ బలవన్మరణానికి పాల్పడే ముందు మిస్బా ఆవేదనతో తన తండ్రికి లేఖ రాసింది. ఆ లేఖలోని ప్రతి అక్షరం కంటతడి పెట్టించింది.
- నెల్లూరుకు చెందిన వైసీపీ కార్పొరేటర్ తమ భూమిని ఆక్రమించి వేధిస్తున్నాడంటూ నెల్లూరుకు చెందిన మస్తాన్‌బీ కుటుంబం కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యకు యత్నించింది. తాను కౌలుకు తీసుకున్న భూమిని వైసీపీ నాయకులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ భట్టిప్రోలు మండలం పోతమర్రుకు చెందిన సలీం ఆ పొలంలోనే ఆత్మహత్యకు యత్నించారు.
- గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వచ్చిన విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్‌ను సమస్యలపై ప్రశ్నించినందుకు రాణీగారితోటకు చెందిన మైనారిటీ మహిళ రమీజాపై వైసీపీ కార్యకర్తలు దాడిచేశారు. కళ్లలో కారం కొట్టి, రాళ్లతో ఇంట్లోని వస్తువులు పగలగొట్టి వీరంగం సృష్టించారు. దాడిచేసిన వారిని వదిలేసి బాధితురాలైన రమీజాపైనే పోలీసులు కేసు పెట్టారు. ఈ కేసులో రమీజా సోదరి ఛోటీని పోలీసులు విచారణ పేరిట పదేపదే పోలీసుస్టేషన్‌కు పిలిపించి వేధించటం వైసీపీ నాయకులు బెదిరించటంతో ఆ ఒత్తిడి తాళలేక ఆమె గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు.
Attacks After YCP Came to Power:
- వైసీపీ అధికారంలోకి రాగానే పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లిలోని 80 ముస్లిం కుటుంబాలపై వైసీపీ నాయకులు రోజూ భౌతికదాడులకు పాల్పడేవారు. ఆయా కుటుంబాలన్నీ గ్రామం విడిచి వెళ్లిపోయేలా దాడులకు తెగబడ్డారు. నాలుగేళ్లవుతున్నా ఇప్పటికీ ఆ 80 ముస్లిం కుటుంబాల్ని గ్రామంలోకి రానీయలేదు..
- పల్నాడు జిల్లా నరసరావుపేట మసీదు భూముల్లో జరుగుతున్న నిర్మాణాలపై ప్రశ్నించినందుకు షేక్ ఇబ్రహీంపై దాడి చేసి చంపేశారు. ఈ దాడిలో రహమత్ అలీ తీవ్ర గాయాలపాలయ్యారు.
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామంలో ముస్లిం బాలికను తీవ్రంగా హింసించి చంపేశారు. ఇది సాధారణ హత్యేనని పోలీసులు తేల్చేశారు.
Land Grabs of YCP Leaders: ఇక వైసీపీ నాయకుల భూకబ్జా బెదిరింపులకు అంతేలేదు. వారికి తోడు పోలీసుల వేధింపులు తోడవడంతో అనేక కుటుంబాలు ఆత్మహత్యకు యత్నించాయి. వైఎస్సార్ జిల్లా ఎర్రబల్లిలోని తన ఎకరన్నర భూమిని వైసీపీ నేత తిరుపేలరెడ్డి కుటుంబం ఆక్రమించి రిజిస్ట్రేషన్ చేయించుకుందని నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన అక్బర్ బాషా కొన్నాళ్ల కిందట ఓ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు యత్నించారు. మైదుకూరు గ్రామీణ సీఐ కొండారెడ్డి స్టేషన్‌కు పిలిపించి తిరుపేలరెడ్డి చెప్పినట్లు వినకపోతే ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరించినట్లు వీడియోలో వాపోయారు. ఆత్మహత్యయత్నం చేసి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ బాషా సమస్య పరిష్కారం కాలేదు.
అనంతపురం జిల్లా నార్పల మండలం వెంకటాంపల్లి వాసి నన్నేసాబ్‌కు చెందిన 3.71 ఎకరాల భూమిని వైసీపీ నాయకుల అండతో కొందరు ఆక్రమించారు. దీనిపై ప్రశ్నించినందుకు వెళ్లగా అతడిపై దాడికి పాల్పడ్డారు. వారి దౌర్జన్యం భరించలేక నన్నేసాబ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు.
YCP Leaders Attacks on Opposition Laders: అక్రమాలు, అవినీతిపై ప్రశ్నించినందుకు ప్రతిపక్ష నాయకులపై వైసీపీ నాయకుల దాడులకైతే లెక్కేలేదు.
- గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ నాయకులు అక్రమంగా మట్టి తవ్వుతున్నారని కొండ పోరంబోకు స్థలాన్ని అమ్ముకుంటున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినందుకు తెలుగుదేశం మైనారిటీ నాయకుడు షేక్ సుభానీపై వైసీపీ నాయకులు దాడి చేశారు.
- తుళ్లూరు మండలం రాయపూడికి చెందిన షేక్‌జానీతో పాటు మరికొందరు ముస్లింలను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. ఇద్దరు యువకుల మధ్య వివాదాన్ని పెద్దది చేసి మూడు రోజులపాటు హింసించారు. గంజాయి కేసు పెడతామని రౌడీషీట్ తెరుస్తామని వారిని బెదిరించారు.
Police are Behaving Like YCP Workers: పల్నాడు జిల్లా మాచర్లలో తెలుగుదేశం మైనారిటీ నేత సయ్యద్ అన్వర్ బాషాను అర్ధరాత్రి వేళ సివిల్ దుస్తుల్లో వచ్చిన పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. ఓ పాత కేసులో అతన్ని ఇరికించి బక్రీద్ ముందురోజు అదుపులోకి తీసుకోవడం వివాదాస్పదమైంది. పెదకూరపాడు నియోజకవర్గం అమరావతిలో లాల్ జాన్ బాషా అనే యువకుడిని రంజాన్ మాసంలో పోలీసులు బూటుకాళ్లతో తన్ని విచక్షణరహితంగా కొట్టారు. ఆళ్లగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అవినీతిని ప్రశ్నించినందుకు భాజపా మైనార్టీ మోర్చా నేత హసన్‌ను పోలీసుల సాయంతో వైసీపీ నాయకులు అపహరించారు. అతన్ని దారుణంగా కొట్టి హతమార్చేందుకు ప్రయత్నించారని భాజపా నాయకులు 2021 జూన్‌లో డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.