Amaravathi Plots: నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలోని పేద ప్రజలకు రాజధాని అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాలను ప్రభుత్వం ఇస్తోంది. దీనిలో భాగంగా ఈ నెల 26వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా మొత్తం 1వేల 402 ఎకరాల్లో ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు.. సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ వెల్లడించారు. దీని కోసం 25 లే అవుట్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. పనులు చివరి దశలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాకు కేటాయించిన 751 ఎకరాల్లో 14 లే అవుట్లు, గుంటూరు జిల్లాకు కేటాయించిన 650 ఎకరాల్లో 11 లే అవుట్లు సిద్ధం చేశారు. వాటిలో 51వేల 392 ప్లాట్లను అభివృద్ధి చేస్తున్నట్లు కమిషనర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం భూమి చదును ప్రక్రియ పూర్తయిందని తెలిపిన ఆయన.. సరిహద్దు రాళ్ల ఏర్పాటు, ప్లాట్ల నంబరింగ్ ప్రక్రియ జరుగుతోందని వివరించారు.
సీఎం జగన్ చేతుల మీద పంపిణీ ప్రారంభం: అమరావతి ప్రాంతంలోని నిడమర్రు, కృష్ణాయపాలెం, నవులూరు, ఐనవోలు, మందడం, కురగల్లు, యర్రబాలెం, పిచ్చుకలపాలెం, బోరుపాలెం, నెక్కల్లు, అనంతవరం గ్రామాల పరిధిలో ఈ ప్లాట్లు కేటాయిస్తున్నారు. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి.. సీఎం జగన్ చేతుల మీదుగా ప్లాట్లు పంపిణీ చేయనున్నారు. ఈ సభ కోసం ఏర్పాట్లు శర వేగంగా జరుగుతున్నాయి. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి 50 వేల మంది చొప్పున మొత్తం లక్ష మందిని ఈ బహిరంగ సభకు తరలించాలని.. అధికార యంత్రాంగానికి ఆదేశాలు వచ్చాయి. ప్లాట్ల పంపిణీ కార్యక్రమానికి మరో మూడు రోజులే సమయం ఉండటంతో.. ఓ వైపు లే అవుట్ల అభివృద్ధి పనులు, మరోవైపు బహిరంగ సభ ఏర్పాట్ల పనుల్లో అధికార యంత్రాంగం బిజీ బిజీగా ఉంది.
రాజధాని కోసం 39వేల ఎకరాల భూములు: రాజధాని కోసం అమరావతి రైతులు.. 39వేల ఎకరాలకు పైగా భూములు ఇచ్చారు. ప్రతిగా వారికి ప్రభుత్వం ప్లాట్లను కేటాయించింది. వాటిని అభివృద్ధి చేసి ఇవ్వాలని ఒప్పందంలో ఉన్నా.. వైసీపీ ప్రభుత్వం ఆ అంశాన్ని పట్టించుకోలేదు. అక్కడ కంప చెట్లు పెరిగి.. ఆ ప్రాంతమంతా అడవిలా మారినా.. వాటిని తొలగించలేదు. ప్లాట్ల వద్దకు వెళ్లేందుకు అక్కడ రోడ్డు సౌకర్యం లేదు. కనీసం ఎవరి ప్లాట్ ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితిలో రైతులు ఉన్నారు. కాగా.. తామిచ్చిన భూముల్లో ఇతర ప్రాంతాల వారికి ప్లాట్ల పంపిణీ ప్రక్రియ.. రాజధాని రైతుల్లో ఆగ్రహానికి, ఆవేదనకు కారణమవుతోంది.
ఇవీ చదవండి: