BRS meeting in Khammam: తెలంగాణలో బీఆర్‌ఎస్ తొలి బహిరంగ సభ కోసం ఖమ్మం ముస్తాబైంది. ఎటుచూసినా గులాబీ తోరణాలు, భారీ కటౌట్లు, హోర్డింగ్‌లతో గులాబీ మయంగా మారింది. మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి మరో 6 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు తరలిరానున్నారు.
BRS meeting in Khammam today : తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న ఖమ్మం జిల్లా నుంచి జాతీయ రాజకీయ సైరన్ మోగించి భారాస సత్తా చాటేలా సభను నిర్వహిస్తున్నారు. 5 లక్షల మందిని సభకు సమీకరించేలా వారం నుంచి సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఖమ్మం నూతన కలెక్టరేట్ వెనుక నిర్వహిస్తున్న సభ కోసం 100 ఎకరాలు సిద్ధం చేశారు. ఆధునిక హంగులతో జర్మన్ టెక్నాలజీని ఉపయోగించిన వాటర్, ఫైర్ ప్రూఫ్ టెంట్‌తో వేదికను రూపొందించారు.
"పెద్ద ఎత్తున జనం స్వచ్ఛందంగా తరలిరావడానికి సిద్ధపడుతున్నారు. ముఖ్యంగా సూర్యపేట, నల్గొండ జిల్లాలు నుంచి జనం వస్తున్నారు. ఏపీ నుంచి కూడా జనం రావాడానికి ఇష్టపడుతున్నారు. కేసీఆర్ మాటలు వినాలని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు".-జగదీశ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి
బహిరంగ సభకు లక్షలాదిగా కార్యకర్తలు, వేలాది వాహనాలు రానుండటంతో పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా భారాస జాగ్రత్తలు తీసుకుంది. 448 ఎకరాల్లో 20 ప్రాంతాల్లో వాహనాలు నిలిపేందుకు స్థలాలు సిద్ధం చేశారు. సభలో 50 ఎల్‌ఈడీ తెరలు, 100 మొబైల్ టాయ్‌లెట్స్, 8 లక్షల మజ్జిగ, నీటి ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నారు. వెయ్యి మంది వాలంటీర్లు సభలోని గ్యాలరీల్లో విధులు నిర్వర్తించేలా ఏర్పాట్లు చేశారు. సభకు హాజరయ్యేందుకు మంత్రులు, ప్రజా ప్రతినిధులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బీఆర్‌ఎస్ ముఖ్యనేతలంతా మంగళవారం రాత్రే ఖమ్మం చేరుకున్నారు.
"మొత్తం 5 వేల 200 మందితో భద్రాత ఏర్పాట్లు చేశాం. ఎక్కడ ఎటువంటి అంవాఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్నాం. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం". -విష్ణు వారియర్, ఖమ్మం సీపీ
నలుగురు ముఖ్యమంత్రులు, పలువురు జాతీయ పార్టీల నేతలు రానున్న వేళ.. పోలీసు శాఖ పటిష్టబందోబస్తు ఏర్పాటు చేస్తోంది. 5వేల 200 మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 10 మంది ఐపీఎస్‌ల పర్యవేక్షణలో బందోబస్తు కొనసాగనుంది. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కరీనంగర్ సింహగర్జన స్ఫూర్తితో ఖమ్మం గడ్డంపై భారీ బహిరంగ సభ నిర్వహించి జాతీయ రాజకీయాలకు శంఖారావం పూరించాలని కేసీఆర్ నిర్ణయించారు.
ఇవీ చదవండి: