APSRTC Recruitment : ఆర్టీసీ రథ చక్రం గాడి తప్పేలా చేసింది జగన్ సర్కారు. సురక్షిత ప్రయాణం నినాదం ద్వారా ప్రజల విశ్వాసం పొందిన ఈ సంస్థ 2020 జనవరిలో ప్రభుత్వంలో విలీనమై ప్రజా రవాణా శాఖగా మారాక దానిని పట్టించుకోవటం మానేసింది. ఎడాపెడా అద్దె బస్సులను పెంచేస్తూ.. సొంత బస్సుల్లో సైతం ప్రైవేటు డ్రైవర్లను వినియోగిస్తూ.. శాశ్వత భర్తీ ప్రక్రియను పూర్తిగా పక్కన పెట్టేసింది. ప్రతి డిపో పరిధిలోనూ ఆన్‌కాల్ డ్రైవర్లుగా ప్రైవేటు వ్యక్తులను తీసుకుంటోంది. ఎలాంటి శిక్షణలేని వీరితో సురక్షిత ప్రయాణం ఎలా సాధ్యమో చెప్పాలన్న ప్రజల ప్రశ్నలకు.. జగన్ సర్కారు దాటవేత వైఖరి అవలంభిస్తోంది.
పగిలిన అద్దాలు.. చిరిగిన సీట్లు.. అరిగిన టైర్లు.. కదిలితే చిరాకు పెట్టే శబ్దాలు.!
సమాచార హక్కు చట్టం కింద ప్రజా రవాణా శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం.. మొత్తం పోస్టుల సంఖ్య 56వేల 62. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు 49వేల 482. అంటే 6వేల 580 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంతే కాదు సంస్థ అన్ని విభాగాల్లోనూ ఖాళీలు భారీగా ఉన్నాయి. కొరత ఉన్న చోట ప్రభుత్వం బయటవారితో పని చేయిస్తోంది. ప్రతి డిపోలోనూ బస్సుల నిర్వహణ పనులు చాలా కీలకం. లేకపోతే ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ. నిర్వహణ వ్యవస్థకు అవసరమైన సిబ్బంది ఖాళీలు భారీగా ఉన్నా జగన్ ప్రభుత్వం భర్తీ చేయటం లేదు. రాష్ట్రంలోని అన్ని డిపోల గ్యారేజీలు, జోనల్ వర్క్‌షాపులు, టైర్ రీట్రేడింగ్ యూనిట్లలో పెద్ద సంఖ్యలో సిబ్బంది కొరత ఉంది. పొరుగు సేవల సిబ్బందితో ఏదో నడిపిస్తున్నారు. కొన్ని విభాగాల్లో ఇది ప్రమాదకరమైనా పట్టించుకోవటం లేదు. భారీగా ఖాళీలున్న మెకానికల్ సిబ్బంది నియామకాల ఊసెత్తడం లేదు. కొత్త బస్సుల కొనుగోలుకు సర్కారు ఆసక్తి చూపడం లేదు.
బాస్ చెప్పాడు.. వైఎస్సార్సీపీ సేవలో ఆర్టీసీ బస్సులు, ప్రయాణికులకు అవస్థలు
ఆర్టీసీలో 12 రకాల విభాగాలున్నాయి. ఇందులో ఆపరేషన్స్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాల్లోనే అత్యధిక పోస్టులుంటాయి. ఆపరేషన్స్‌లో మొత్తం 41 వేల 361 పోస్టులకుగాను 18వందల 6 ఖాళీలున్నాయి. ఇందులో డ్రైవర్లు వెయ్యి 93 మందితోపాటు కంట్రోలర్లు, అదనపు కంట్రోలర్లు 682 ఎక్కువగా ఖాళీగా ఉన్నాయి. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో.. హెల్పర్ లేదా డిప్యూటీ మెకానిక్స్ 215, శ్రామిక్ లేదా అసిస్టెంట్ మెకానిక్స్ 15 వందల17, కోచ్ బిల్డర్స్ 194, ఎలక్ట్రీషియన్స్ 158, టైర్ మెకానిక్స్ 60, పెయింటర్లు 113, ట్రిమ్మర్లు 107, స్పింగ్స్ పనులు చేసే బ్లాక్ స్మిత్, హేమర్‌మేన్లు 214 మంది కావాలి. ఇలాంటివన్నీ కలిపి 3వేల 462 పోస్టులను జగన్ సర్కారు భర్తీ చేయడం లేదు. టైర్ రీట్రేడింగ్ యూనిట్లలో 430 పోస్టులకు గానూ.. కేవలం 138 మందే పనిచేస్తున్నారు. కండక్టర్ పోస్టులు మాత్రమే మంజూరైన సంఖ్యకంటే 322 ఎక్కువగా ఉన్నాయి. అనేక సర్వీసుల్లో కండక్టర్లు లేకుండా.. డ్రైవర్లకే టిక్కెట్ జారీ యంత్రాలు ఇచ్చి పని చేయిస్తుండడమే దీనికి కారణం.
పీఆర్సీ సమస్యలు పరిష్కరించాలంటూ, ఆర్టీసీ ఎండీకి జేఏసీ లేఖ
మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఏళ్ల తరబడి పోస్టులను భర్తీ చేయడం లేదు. వివిధ పనులు సకాలంలో పూర్తి కావడం లేదంటూ.. జోనల్ వర్క్‌షాపుల్లోని బ్రేక్స్, స్టీరింగ్ ఓవరాలింగ్ పనులను ప్రైవేటు సంస్థకు పైలెట్ ప్రాజెక్ట్ కింద అప్పగించేందుకు ఇటీవల నిర్ణయించారు. ఇలా అనేక విభాగాల్లో పోస్టుల ఖాళీలను సాకుగా చూపించి, మరిన్ని పనులను ప్రైవేటుకు అప్పగిస్తారని ఆర్టీసీ ఉద్యోగులు, వాటి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల కారుణ్య నియామకాల కింద కొన్ని పోస్టులను భర్తీ చేసినా.. కీలక విభాగాల్లో అత్యధిక ఖాళీలు అలాగే ఉన్నాయి. వచ్చే జనవరి నుంచి ఉద్యోగ విరమణలు మొదలవనున్నాయి. దీంతో అన్ని విభాగాల్లోనూ ఖాళీల సంఖ్య భారీగా పెరగనుంది. చాలామంది డ్రైవర్లు, కండక్టర్లు ఉద్యోగ విరమణ చేయబోతున్నారు.