Vasireddy Padma letter to DGP: సోషల్ మీడియాలో మహిళలను అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.. డీజీపీని కోరారు. ఈ మేరకు ఆమె రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. వివిధ రాజకీయ పార్టీల నేతల సోషల్ మీడియా విభాగం పోస్టింగులపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ దురుద్దేశాలతో మహిళల్ని లక్ష్యంగా చేసుకుని అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తూ తూలనాడటం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక బృందాలతో నిఘా ఉంచి.. సోషల్ మీడియా పోకడలను కట్టడి చేయాలని వాసిరెడ్డి పద్మ లేఖలో పేర్కొన్నారు. అదే విధంగా 'ఐటం' వంటి పదాలకు జైలు శిక్షలు పడుతున్న విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలని ట్వీట్ చేశారు. ఇదే పోస్టును వైకాపాతో పాటు తెదేపా, జనసేన, కాంగ్రెస్ పార్టీల ట్విట్టర్ ఖాతాలకు ట్యాగ్ చేశారు.
పవన్ కల్యాణ్‌కు ఇటీవల మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వటంపై జనసేన సోషల్ మీడియా తీవ్రస్థాయిలో మండిపడింది. రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు జరిగినప్పుడు మహిళా కమిషన్ ఎక్కడ అంటూ ప్రశ్నలతో ప్రచారం చేపట్టింది. దీంతో మహిళా కమిషన్ రాజకీయ పార్టీల సోషల్ మీడియా విభాగాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే డీజీపీకి లేఖ రాయడం, రాజకీయ పార్టీలకు ట్వీట్ చేసినట్లు సమాచారం.
ఇవీ చదవండి: