అమరావతిలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సుమారు 2 గంటలపాటు సాగింది. ఈ సమావేశంలో... కరవు, ఫొని తుపాను, తాగునీటి ఎద్దడి, ఉపాధిహామీ పనులపై చర్చించారు. ఉపాధిహామీ పెండింగ్ బిల్లులపై అధికారులకు మంత్రివర్గం పలు సూచనలు చేసింది. కేంద్రం ఇప్పటికే హామీ ఇచ్చినందున రుణాలు తీసుకోవాలని సూచించింది. తాగునీటి ఎద్దడి నివారణకు తీసుకుంటున్న చర్యలను, పట్టణాల్లో అందుబాటులో ఉన్న నీటివనరుల గురించి సమావేశంలో అధికారులు వివరించారు. సీఎం సహాయనిధి చెక్కులు వెనక్కి వస్తున్న అంశంపై మంత్రులు ప్రస్తావించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పని చేయాలని సీఎం సూచించినట్లు సమాచారం.
రైతులకు పరిహారం అందించాలి: సోమిరెడ్డి
ఫొని తుపాను వల్ల ఉద్యానపంటలు నష్టపోయాయని... బాధిత రైతులకు పరిహారం ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్లు సోమిరెడ్డి వెల్లడించారు. కరవు పరిస్థితుల నేపథ్యంలో రబీ పంటకు సంబంధించి రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్ర సీఎస్‌తో విభేదాలు ఉన్నాయా అని ఓ పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు.. అధికారులతో మాకు ఎలాంటి సమస్యా లేదని సోమిరెడ్డి జవాబిచ్చారు. అధికారుల సహకారం వల్లే అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించామన్నారు.
అధికారులకు సీఎం ప్రశంస
ఉపాధి హామీ పథకం అమలులో ఉత్తమ రాష్ట్రంగా ఏపీ నిలవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశంలో అధికారులను ఉపాధి హామీ, పంచాయతీరాజ్‌శాఖ అధికారులను అభినందించారు. ఉపాధి హామీ అమలుకు సంబంధించి ఏపీ 5 విభాగాల్లో తొలిస్థానం, 6 విభాగాల్లో రెండోస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.