AP Sarpanch Association Fires on YSRCP Govt: గ్రామ పంచాయితీలు అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను వైసీపీ ప్రభుత్వం సొంతానికి వాడుకుంటుందని ఏపీ పంచాయితిరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం.. గ్రామాల అభివృద్ధికి కేటాయించిన నిధులు వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంటే.. కేంద్ర పెద్దలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఛలో డిల్లీ కార్యక్రమం చేపడితే.. కేంద్రం విచారణ జరిపి.. పంచాయతీలకు కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని తేల్చిందన్నారు. అయినా నేటికీ వైసీపీ ప్రభుత్వంపై ఎటువంటి చర్యలుకేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు.
ఈరోజు వైసీపీ మద్దతుతో గెలిచిన సర్పంచులు సైతం సీఎం జగన్ తీరును వ్యతిరేకిస్తున్నారన్నారు. 8 వేల 6 వందల 29 కోట్ల రూపాయల నిధులు వైసీపీ ప్రభుత్వం స్వాహా చేసిందని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో సర్పంచ్ల పరిస్థితి సచివాలయ సిబ్బంది కంటే హీనమైపోయిందన్నారు. గ్రామాల్లో రోడ్లు, మురుగు కాలువల్లో పూడిక తియ్యడానికి సైతం నిధులు లేని పరిస్థితి నెలకొందని విమర్శించారు.
విజయవాడ బాలోత్సవ్ భవన్లో ఏపీ సర్పంచుల సంఘం, ఏపీ పంచాయితీ రాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి సర్పంచుల సదస్సుకు.. అన్ని పార్టీల సర్పంచులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో గ్రామాల్లో అభివృద్ధి లేకుండా పోయిందని.. వివిధ పార్టీల మద్దతుతో గెలుపొందిన సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ప్రజలు సమస్యలపై నిలదీస్తుంటే సమాదానం చెప్పలేని పరిస్థితులు దాపురించాయని అన్నారు. గ్రామ పంచాయతీల నిధులు, హక్కుల కోసం ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
"కేంద్ర అధికారులు వచ్చి.. పరిశీలన చేశారు. కేంద్ర పంపించిన డబ్బులను జగన్ మోహన్ రెడ్డి దొంగిలించారని స్పష్టంగా నిర్థరణకు వచ్చారు. ఇది జరిగి రెండు నెలలు అవుతోంది. కేంద్రం రాష్ట్రానికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.. కానీ దీనిపై ఎవరూ స్పందించడం లేదు. సర్పంచుల నిధులు దొంగిలించిన విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంత వరకు బాధ్యత ఉందో.. దానికి సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానిది కూడా అంతే బాధ్యత ఉంటుంది. దీనిపై అవసరం అయితే.. మరోసారి ఛలో దిల్లీ చేపడతాం. ఈ సారి తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాం". - రాజేంద్రప్రసాద్, ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు
"ముఖ్యమంత్రి జగన్ పరదాలు కట్టుకుని తిరిగినట్లు.. మేము అలా గ్రామాల్లో తిరగలేము. నిత్యం ప్రజల మధ్య తిరగాలి. ముఖ్యమంత్రి మా నిధులును తీసుకుని.. మమ్మల్ని ఉత్సవ విగ్రహాలను చేశారు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. గ్రామాలు అధ్వానంగా ఉన్నాయి". - వి.లక్ష్మి, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలు