మద్యం అమ్మకాలపై వివిధ పార్టీలు అపోహలు కలిగిస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. మద్యం అమ్మకాలపై నిర్ణయం పూర్తిగా రాష్ట్రాలదేనని స్పష్టం చేశారు. వివిధ రాష్ట్రాల వినతి మేరకు కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చిందని వెల్లడించారు.
కేంద్రం ఆదేశించడం వల్లే మద్యం విక్రయాలు చేస్తున్నామని ఏపీ మంత్రులు చేసిన ప్రకటనలు పూర్తిగా అవాస్తవమని జీవీఎల్ చెప్పారు. కేంద్రం ఆశించడం నిజమైతే మిగతా దక్షిణాది రాష్ట్రాలు ఎందుకు మద్యం విక్రయించటం లేదని ప్రశ్నించారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం రాష్ట్రాలకే వెళ్తుందన్న ఆయన... 75 శాతం ధరలు పెంచి అమ్మాలని నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం కాదా..? అని నిలదీశారు.
వైకాపా ప్రభుత్వ నిర్ణయాలను కేంద్రంపై రుద్దడం సరికాదని జీవీఎల్ అన్నారు. మద్యం అమ్మకాలపై ఆగమేఘాల మీద నిర్ణయం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. మద్యం విషయంలో వైకాపా, తెదేపావి అవకాశవాద రాజకీయాలని విమర్శించారు. మద్య నిషేధం అంటున్న వైకాపా.. షాపులు ఎందుకు తెరిచిందని అడిగారు. మద్య నిషేధం అమలు చేసేందుకు ఇది సరైన అవకాశం కాదా అని నిలదీశారు.
ఇదీ చదవండి