AP High Court On R5 Zone Petition : రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా రాజధాని అమరావతిలో ఇళ్ల స్థలాలిచ్చే ప్రక్రియపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇళ్లు నిర్మించాల్సిన చట్టబద్ద బాధ్యత తమపై ఉందంటున్న ప్రభుత్వం ఇతర విషయాల్లోనూ ఆ బాధ్యతను ఎందుకు నెరవేర్చడం లేదని హైకోర్టు ప్రశ్నించింది.
అమరావతిలో 1134 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చే నిమిత్తం గుంటూరు జిల్లాలో 550.65ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లాలో 583.93 ఎకరాలు జిల్లా కలెక్టర్లకు భూబదలాయిపు నిమిత్తం సీఆర్‌డీఏ కమిషనర్‌కు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి మార్చి 31న జీవో 45 జారీ చేశారు. ఆ జీవోను సవాలు చేస్తూ రాజధాని ప్రాంత రైతులు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు.
రైతుల తరఫున సీనియర్ న్యాయవాదులు దేవదత్ కామత్, వీఎస్‌ఆర్ ఆంజనేయులు వాదనలు వినిపించారు. సీఆర్‌డీఏ చట్ట నిబంధనల ప్రకారం మొత్తం భూమిలో కనీసం 5శాతం భూమిలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కోసం హౌజింగ్ స్కీమ్‌కు వినియోగించాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో 5,024 టిడ్కో ఇళ్లు నిర్మించారని, కానీ ఇప్పటి వరకు వాటిని లబ్దిదారులకు కేటాయించలేదన్నారు. దారిద్య్రరేఖకు దిగువున ఉన్న కుటుంబాలు టిడ్కో ఇళ్లకు అర్హులేనని రెసిడెన్సియల్ జోన్లలో ఇళ్ల స్థలాలిస్తామంటే తమకు అభ్యంతరం లేదని కోర్టుకు తెలిపారు.
అమరావతి బృహత్తర ప్రణాళికలో మార్పులు చేసి ఎలక్ట్రానిక్ సిటీకి చెందిన 1800 ఎకరాల్లో 700 ఎకరాలను ఇళ్ల స్థలాలిస్తామడంపైనే తమ అభ్యంతరమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎలక్ట్రానిక్ సిటీ ద్వారా 3.70లక్షల ఉద్యోగాలు లభిస్తాయని.. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీ తేలేవరకు ఇళ్ల స్థలాల కేటాయింపును నిలువరించాలని కోరారు. ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు కలెక్టర్లకు భూ బదలాయించడం హైకోర్టు తీర్పును ఉల్లంఘించడమేనన్నారు.
అధికారుల చర్య కోర్టుధిక్కరణ కిందకు వస్తుందని పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల పేరుతో అమరావతి ప్రాజెక్ట్‌ను దెబ్బతీసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని...అందుకే ఆర్థిక వనరుల్ని సృష్టించే ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం పూనుకుందన్నారు. ఇది భూములిచ్చిన రైతుల హక్కుల్ని హరించడమేనని పేర్కొన్నారు. రాజధానిలో కనీసం రహదార్లు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయలేదని.. వీధి దీపాలు, రహదారుల కోసం హైకోర్టు ఉద్యోగుల సంఘం న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని స్టే ఇవ్వాలని రైతుల తరఫు న్యాయవాదులు కోరారు.
ప్రభుత్వం, సీఆర్‌డీఏ తరఫున వాదనలు వినిపించిన అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి.... పేద ప్రజల ఇళ్ల స్థలాల కేటాయింపు గురించి మాస్టర్ ప్లాన్‌లో ప్రస్తావన లేదన్నారు. ఈ నేపథ్యంలో చట్ట సవరణ చేశామని, సీఆర్‌డీఏ చట్టం సెక్షన్ 53(1)(డి) ప్రకారం హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పునకు అనుగుణంగానే పేదలకు ఇళ్ల స్థలాలిస్తున్నామన్నారు. రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల గురించి మాత్రమే హక్కులుంటాయని, వారేమి భూములను త్యాగం చేయలేదన్నారు. 1100 కోట్లు చెల్లించి సీఆర్‌డీఏ నుంచి రాష్ట్ర ప్రభుత్వం భూమిని కొనుగోలు చేసిందన్నారు. రాజధాని అమరావతి కోసం సీఆర్‌డీఏ సొంతంగా నిధులు సమకూర్చుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించే వీల్లేదన్నారు.
పీఎమ్ఏవై పథకం కింద రాజధాని ప్రాంతంలో 5024 ఇళ్లు నిర్మించామని, టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు కొంత వాటా సొమ్మును భరించాల్సి ఉందన్నారు. లబ్ధిదారులకు ఇప్పటికే ఇళ్లు కేటాయించామని, అందులో 99 ఇళ్లను తీసుకునేందుకు నిరాకరించారని తెలిపారు. మరో 147 ఇళ్లకు సంబంధించి బ్యాంకు రుణాల సమస్యలున్నాయన్నారు. సీఆర్‌డీఏ చట్టం షెడ్యూల్-2 ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ఇళ్ల నిర్మించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు అనుగుణంగానే ఇళ్లస్థలాలిస్తున్నామన్నారు.
సుధీర్ఘ వాదనలు విన్న జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ రవినాథ్ తిల్హరీతో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులిస్తామని ప్రకటించింది.
ఇవీ చదవండి