AP High Court Judge Justice DVSS Somayajulu Retirement Programme: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు పదవీ విరమణ సందర్భంగా హైకోర్టు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్ అధ్యక్షతన మొదటి కోర్టు హాలులో వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు సతీమణి శర్వాణి, తనయుడు కేతన్ పాల్గొన్నారు. హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్ జస్టిస్ సోమయాజులు అందించిన న్యాయసేవలను ఆయన కొనియాడారు.
న్యాయ వ్యవస్థపై జస్టిస్ డీవీఎస్‌ఎస్ చెరగని ముద్ర వేశారన్నారు. పలు కేసుల్లో కీలక తీర్పులు ఇచ్చారని కితాబిచ్చారు. వేల కేసులు పరిష్కరించారని గుర్తు చేశారు. సివిల్, వాణిజ్య, మధ్యవర్తిత్వ, తదితర కేసులను పరిష్కరించడంలో ప్రత్యేక గుర్తింపు పొందారన్నారు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా కుటుంబ వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారన్నారు. ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, బీసీసీఐ లీగల్ కమిటీ సభ్యులుగా, విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, వాల్తేర్ క్లబ్ అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో సేవలు అందించిన ఘనత జస్టిస్ సోమయాజులది అని గుర్తు చేశారు.
ఉపాధ్యాయులు రోడ్డెక్కడం ఏపీ చరిత్రలో ఎప్పుడైనా చూశారా?: హైకోర్టు
ఏపీలో జిల్లా కోర్టు న్యాయవాది నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా ఎదిగిన మొదటి వ్యక్తి జస్టిస్ సోమయాజులని తెలిపారు. హైకోర్టు పరిపాలన సంబంధ విషయాల్లో తనకు విలువైన సలహాలిచ్చారన్నారు. ఆయన పదవీ విరమణతో న్యాయవ్యవస్థ ఓ మంచి జడ్జి సేవలకు దూరమవుతోందన్నారు. పదవీ విరమణ అనంతరం ఆయన శేషజీవితం ప్రశాంతంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు.
కక్షిదారులకు న్యాయం అందించేందుకు శక్తిమేరకు పనిచేశానని జస్టిస్ సోమయాజులు అన్నారు. న్యాయవాదులు వినిపించే మంచి వాదనల వల్లనే మంచి తీర్పులు వస్తాయన్నారు. వృత్తి జీవితంలో తనకు ఎంతోమంది సూచనలు, సలహాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఉమ్మడి హైకోర్టు, ఏపీ హైకోర్టులో పనిచేసిన పలువురు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వృత్తి జీవితం సంతృప్తినిచ్చిందన్నారు. ఇందుకు సహకారం అందించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు.
సాహితీ వసంతోత్సవంలో.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు
జస్టిస్ సోమయాజులు కేసుల విచారణ సందర్భంగా ఎంతో ఓపిక, సహనంతో వ్యవహరించేవారని ఏజీ శ్రీరామ్ అన్నారు. జిల్లా కోర్టు న్యాయవాదిగా పనిచేసిన అనుభవంతో కేసుల్లో లోతులను సులువుగా అర్థం చేసుకునేవారన్నారు. ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జానకిరామిరెడ్డి ఆధ్వర్యంలో జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు, శర్వాణి దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ సోమయాజులు దంపతులకు శాలువాలు కప్పారు. చిత్రపటం, జ్ఞాపికలను అందజేశారు.
దక్షిణ భారతదేశం రానున్న రోజులో ఆర్థికంగా మరింత అభివృద్ధి అవుతుంది: కంచి కామకోటి పీఠాధిపతి