AP High Court Grants Anticipatory Bail To Chandrababu : రాజధాని అమరావతికి, సీఆర్డీఏ ప్రాంతానికి, సీడ్ కేపిటల్‌కు మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు సింగపూర్‌కు చెందిన సుర్బానా సంస్థను నామినేషన్ విధానంలో కన్సల్టెంట్‌గా నియమించడానికి చెప్పిన కారణాలు సహేతుకంగా కనిపిస్తున్నాయని హైకోర్టు తెలిపింది. సుర్బానాతో పాటు, ఐఆర్ఆర్ ప్రణాళిక కోసం స్టూప్ కన్సల్టెన్సీని నియమించడంలో చంద్రబాబుకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరాయనడానికి సీఐడీ ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని హైకోర్టు స్పష్టం చేసింది.
ఆ కేసులో 2022 సెప్టెంబరు 5న ఎస్ఐఆర్ నమోదైతే 2023 సెప్టెంబరు వరకు దర్యాప్తునకు హాజరవ్వాలని గానీ, అవసరమైన సమాచారం, పత్రాలు అందజేయాలని గానీ సీఐడీ కోరలేదని చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా (Sidharth Luthra) వాదించారు. స్కిల్ కేసులో అరెస్టుచేసిన తర్వాతే, ఐఆర్ఆర్ కేసులోనూ కస్టడీ కోరుతూ సీఐడీ పీటీ వారంటు జారీ చేసిందన్నారు. కేసు నమోదయ్యాక ఇన్నాళ్లూ కస్టోడియల్ ఇంటరాగేషన్ కోరనప్పుడు ఇప్పుడు ఆ అవసరం ఏమొచ్చిందన్న సిద్ధార్థ లూథ్రా వాదనతో కోర్టు ఏకీభవించింది. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలన్న సీఐడీ విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
పేదల కోసమే ఉచిత ఇసుక విధానం - చంద్రబాబు లబ్ది పొందారనే దానిపై ఆధారాలేవి: హైకోర్టు
Chandrababu Anticipatory Bail : ఐఆర్ఆర్ కేసులో సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇచ్చిన అధికారులను చంద్రబాబు కుమారుడు లోకేశ్ ఇటీవల కొన్ని టీవీ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో బెదిరించినట్లు సీఐడీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దాఖలు చేసిన మెమో గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఐఆర్ఆర్ కేసు గురించి లోకేశ్ ప్రస్తావించలేదని చంద్రబాబు తరపు న్యాయవాది వాదించారు. బెయిల్ ఇవ్వాలా వద్దా అన్నది పిటిషనర్ కుమారుడి వ్యాఖ్యలపై ఆధారపడదని కోర్టు స్పష్టం చేసింది. స్టూప్ కన్సల్టెన్సీ మూడు ఆప్షన్లు ఇచ్చి, వాటిలో ఆప్షన్-2 వల్ల ఐఆర్ఆర్ లక్ష్యం నెరవేరదని, భూసేకరణకు, రోడ్డు నిర్మాణానికి ఎక్కువ ఖర్చవుతుందని పేర్కొన్నా చంద్రబాబు దాన్నే ఎంపికచేశారన్న వాదనతో కోర్టు ఏకీభవించలేదు. ఆ కేసులో 36వ నంబరు సాక్షి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం అప్పటి పురపాలకశాఖ మంత్రి నారాయణ ఆప్షన్-1 లోని ఇబ్బందుల్ని వివరిస్తూ, ఆప్షన్-2ని సూచించారని ఆయన సూచన సరైంది కాదని నిరూపించే ఆధారాలేవీ ప్రభుత్వం సమర్పించలేదని కోర్టు పేర్కొంది.
ఐటీ రిటర్న్‌లలో ప్రస్తావించలేదు : మాస్టర్‌ప్లాన్, ఐఆర్ఆర్ ఎలైన్మెంట్‌ను లింగమనేని రమేష్ భూముల పక్కనుంచి వెళ్లేలా చూడటం ద్వారా చంద్రబాబు ఆయనకు అనుచిత లబ్ధి చేకూర్చారని అడ్వకేట్ జనరల్ వాదించారు. లింగమనేని ఇంట్లో చంద్రబాబు అద్దె చెల్లించకుండా ఉంటున్నారని తెలిపారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి బ్యాంకు ఖాతా నుంచి 27 లక్షల రూపాయలు లింగమనేని ఖాతాకు బదిలీ అయినట్లు చూపించారని కానీ భువనేశ్వరి, లింగమనేని రమేశ్ ఐటీ రిటర్న్‌లలో దాన్ని ప్రస్తావించలేదని తెలిపారు. దీనిపై కోర్టు స్పందిస్తూ ఆదాయ పన్ను రిటర్న్‌లలో చూపించనంత మాత్రాన అద్దె చెల్లించలేదని చెప్పలేమని, రిటర్న్‌లలో దాన్ని చూపించకపోతే చర్యలు తీసుకోవడం ఐటీ విభాగం బాధ్యతని స్పష్టం చేసింది. 2014లో కంతేరులో హెరిటేజ్ సంస్థ కొన్న భూములకు 2018లో తీసుకున్న ఐఆర్ఆర్ నిర్ణయానికి ముడిపెట్టడం అసంబద్ధమని, ఆధారాల్లేకుండా చంద్రబాబు ఆ కంపెనీకి మేలు జరిగేలా నిర్ణయం తీసుకున్నారని ఎలా చెబుతారన్న ఆయన న్యాయవాది వాదనతో కోర్టు ఏకీభవించింది.
చంద్రబాబుపై అప్పుడే చర్యలు వద్దు - ఏం చేయాలో మేము చెప్తాం: ఏపీ హైకోర్టు
దర్యాప్తుకు అవరోధం కాదు : ఐఆర్ఆర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా నిందితులకు సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 146ని పరిగణనలోకి తీసుకుని బెయిలు ఇచ్చినా, అదే కారణంతో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వరాదన్న ఏజీ వాదనతో కోర్టు ఏకీభవించలేదు. సెక్షన్ 146ని పరిగణనలోకి తీసుకుని చంద్రబాబుకు బెయిలిచ్చినా, అది దర్యాప్తునకు అవరోధం కాబోదని స్పష్టం చేసింది. ఈ కేసులో తగిన కారణాల్లేకుండా దర్యాప్తు జాప్యం చేయడాన్ని పరిగణనలోకి తీసుకుని చంద్రబాబుకు బెయిలు మంజూరు చేయొచ్చని పేర్కొంది.
కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం లేదు : దర్యాప్తు సంస్థలకూ కోర్టు చురకలు అంటించింది. ఒక వ్యక్తి తప్పుచేశారన్న అభియోగాలు మోపి అరెస్టు చేయడం సరికాదని, కొంత దర్యాప్తు తర్వాత సంతృప్తికర సమాచారం వస్తేనే అరెస్టు చేయడం తెలివైన నిర్ణయమని పేర్కొంది. చంద్రబాబు ప్రతిపక్షనేతగా ఉన్నారని, ప్రభుత్వశాఖతో ఆయనకు సంబంధాలేమీ లేవు కాబట్టి, ఆయన సాక్ష్యాల్ని తారుమారు చేస్తారన్న ఆందోళన అవసరం లేదని పేర్కొంది. ఈ నేరాలు 2015 నుంచి 19 మధ్య జరిగాయని సీఐడీ చెబుతోందన్న హైకోర్టు అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రే అయినా, ఐఆర్ఆర్ పత్రాల్ని ట్యాంపర్ చేశారనడానికి ఆధారాల్లేవంది. కాబట్టి ఆయనకు బెయిలు ఇవ్వడం దర్యాప్తునకు విఘాతం కాదని కోర్టు స్పష్టం చేసింది. పత్రాలన్నీ ప్రభుత్వ కస్టడీలోనే ఉన్నాయి కాబట్టి కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం లేదని తెలిపింది.
సీఐడీ కోర్టును తప్పుదోవ పట్టిస్తోంది- పేదల కోసమే ఉచిత ఇసుక విధానం