AP Govt Negligence on New Medical Colleges: రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు తమ హయాంలోనే జరిగిందని వైసీపీ ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేసుకుంటోంది. కానీ.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. 2021 మేలో 14 వైద్య కళాశాలల నిర్మాణాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. పనులు సవ్యంగా జరిగి ఉంటే 2022-23, 2023-24 విద్యా సంవత్సరాల్లో కళాశాలలు అందుబాటులోకి వచ్చేవి. అయితే నిర్మాణ ఏజెన్సీలను ఖరారు చేయకపోవడం, సుమారు 8 వేల కోట్ల రూపాయల నిధులు ఇవ్వక పోవటం, రుణాల కోసం బ్యాంకర్ల చుట్టూ తిరగాల్సి రావడం వల్ల ప్రక్రియ ఆలస్యమైంది.
2023-24 విద్యా సంవత్సరంలో 5 కళాశాలల్లోనే తరగతులు మొదలయ్యాయి. 2024-25లో మరో 5 కళాశాలలు, మిగతా ఏడు.. 2025-26 విద్యా ఏడాదిలో ప్రారంభం కావాల్సి ఉంది. మూడో దశలో ఏర్పాటు కానున్న ఏడింటిలో కేంద్ర ప్రభుత్వం CSS కింద ప్రత్యేకంగా నిధులు కేటాయించిన పిడుగురాళ్ల వైద్య కళాశాల కూడా ఉంది. పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ల కళాశాలలకు 390 కోట్ల రూపాయల చొప్పున కేంద్రం ఆర్థికసాయం చేసింది. మచిలీపట్నం కాలేజీ ఇప్పటికే ప్రారంభం కాగా.. పాడేరు కళాశాల 2024-25 విద్యా సంవత్సరంలో మొదలు కాబోతోంది.
ప్రస్తుత విధానంలో తొలి సంవత్సరంలో చేరిన విద్యార్థులు ద్వితీయ ఏడాదిలోకి వచ్చేనాటికి వారికి అవసరమైన నిర్మాణాలు, పరికరాలు, మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేయాలి. ఫ్యాకల్టీని నియమించాలి. కోర్సు చివరి ఏడాదికల్లా 600 సీట్లకు సరిపడా సౌకర్యాలు కల్పించాలి. అయితే జాతీయ వైద్య మండలి ఇటీవల కొత్త నిబంధనలు విధించింది. నాలుగు సంవత్సరాల తర్వాత కల్పించే సదుపాయాలన్నింటినీ ప్రారంభ ఏడాదిలోనే సిద్ధం చేయాలని ఆదేశించింది. ఇప్పటికిప్పుడు లేబొరేటరీల ఏర్పాటు, ట్యూటర్ల నియామకాలు, ఇతర నిబంధనల అమలు సాధ్యమయ్యే పనికాదు.
2024-25 విద్యా సంవత్సరంలో పులివెందుల, పాడేరు, ఆదోని, మార్కాపురం, మదనపల్లెలోని కళాశాలలను ప్రారంభించేందుకు ఎన్‌ఎంసీ (National Medical Commission) నుంచి అనుమతి కోరుతూ ప్రభుత్వం దరఖాస్తు చేసింది. కొత్త నిబంధనల నేపథ్యంలో 150 లేదా 100 సీట్లయినా మంజూరు చేయాలని అభ్యర్థించింది. అందుకు అనుగుణంగా వివరాలు సమర్పించింది. ఎన్‌ఎంసీ కొత్త నిబంధనల వల్ల 2025-26లో మొదలవ్వాల్సిన ఏడు వైద్య కళాశాలల భవితవ్యం ప్రమాదంలో పడింది.
ప్రస్తుతం పిడుగురాళ్ల వైద్య కళాశాల భవనాల నిర్మాణం పూర్తి కాలేదు. శంకుస్థాపన తర్వాత పనుల ప్రారంభానికి చాలా సమయం పట్టింది. 25 జూన్ 2022న నిర్మాణ పనులు ప్రారంభం కాగా.. ఇప్పటికి ఒక బ్లాక్ మాత్రమే సివిల్ పనులు అయిపోయాయి. అంతర్గత పనులతో పాటు మౌళిక వసతులు మిగిలే ఉన్నాయి. మొదటి దశ పనుల్లో మిగతా 11 బ్లాకులు వివిధ దశల్లో ఉన్నాయి. రెండో దశ మెడికల్ కళాశాల, ల్యాబ్‌లు, విద్యార్థుల వసతి భవనాలను 17 బ్లాక్‌లుగా విభజించి నిర్మాణాలు చేపడుతున్నారు. వీటిలో 12 బ్లాక్‌లకు సంబంధించిన భవనాలు స్లాబు దశకు చేరుకున్నాయి.
మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభం కావాలంటే దానికి అనుబంధంగా ఉన్న ఆస్పత్రిలో కనీసం ఆరు నెలల పాటు ఓపీ సేవలు అందించాల్సి ఉంటుంది. ఈ ప్రకారం ఈ ఏడాది చివరికే ఓపీ సేవలు ప్రారంభించాల్సి ఉంటుంది. వైద్య కళాశాల ప్రారంభానికి ఇప్పుడు మారిన నిబంధనలు ఇబ్బంది కలిగించే అవకాశముంది. కొత్త రూల్స్ ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పించటం సాధ్యమయ్యేలా కనిపించటం లేదు. అందుకే కొత్త నిబంధనల్ని కొంతకాలం వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం జాతీయ వైద్య మండలిని కోరనున్నట్లు సమాచారం.