గుంటూరు జిల్లా నరసరావుపేటలోని అంజిరెడ్డి ఆస్పత్రిలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ బాధితుడి నుంచి 5 రోజుల వైద్యానికి రూ.3.38 లక్షలు వసూలు చేసినట్లు ఫిర్యాదు అందుకున్న విజిలెన్సు అధికారులు విచారణ జరిపి నిర్ధరించారు. కొవిడ్ వైద్యచికిత్సలకు రెమిడెసివర్ ఇంజెక్షన్ల కోసం అదనంగా బాధితుడి నుంచి ఎక్కువగా వసూలు చేసినట్లు విజిలెన్స్ ఎస్పీ జాషువా వెల్లడించారు.
ఈ ఆసుపత్రికి కొవిడ్ వైద్యచికిత్సలకు అనుమతి లేదని విజిలెన్స్ ఎస్పీ స్పష్టం చేశారు. పిడుగురాళ్లలో ఇదే ఆస్పత్రిలో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఈ నెల 5న కేసు నమోదు కాగా.. అసలు అనుమతి లేకుండా నరసరావుపేటలోనూ కొవిడ్ రోగులకు వైద్యచికిత్సలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంత వరకు ఈ ఆస్పత్రిలో 32 మంది రోగులకు చికిత్సలు చేశారని.. ఓ రోగి మృతి చెందినట్లు తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత శాఖ అధికారులకు సమాచారం అందిస్తామన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 22,399 కరోనా కేసులు... 89 మంది మృతి