Jagan Review on Education: విద్యారంగంలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై నిరంతర సమీక్ష, పర్యవేక్షణ అవసరమని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన జగన్.. 6వ తరగతి ఆపైన ఉన్న ప్రతి తరగతి గదిలోనూ ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల బోధన, నేర్చుకోవడం సులభతరమవుతుందన్నారు. 6వ తరగతి కన్నా దిగువ తరగతులకు టీవీ స్క్రీన్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు సీఎం తెలిపారు.
ఇంటర్మీడియట్ విద్యార్థులకూ డిజిటిల్ సౌలభ్యాన్ని కల్పించడంపై ఆలోచన చేయాలన్నారు. ఇది ఏ రూపంలో ఉండాలన్న దానిపై అధికారులు ఆలోచించి ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు. దీనివల్ల శాశ్వతంగా పిల్లలకు ఉత్తమ బోధన అందించడానికి పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్టు అవుతుందన్నారు. సబ్జెక్ట్ టీచర్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపిన అధికారులు.. ఈ మార్పులు కారణంగా చక్కటి అర్హతలున్న ఉపాధ్యాయులు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చారన్నారు. గతంలో 3,4,5 తరగతుల పిల్లలకు సబ్జెక్టుల వారీగా బోధన లేదని, సబ్జెక్టు టీచర్స్ కాన్సెప్ట్‌లో భాగంగా సబ్జెక్టుల వారీ టీచర్లతో మంచి బోధన అందుతుందన్నారు. విద్యార్థులు 6వ తరగతిలోకి రాగానే విద్యను సీరియస్ అంశంగా తీసుకుని మరింత దృష్టి పెట్టాలన్నారు.
ఐఎఎఫ్‌పి ఏర్పాటు, సబ్జెక్టుల వారీ టీచర్లతో వారి బోధనపై సీరియస్‌గా ఉండాలన్నారు. సీరియస్‌గా బోధన లేకపోతే ఫలితం ఉండదన్నారు. మొక్కుబడిగా చేస్తే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బ తింటుందన్నారు. ఐఎఫ్‌బీ ప్యానెల్స్ కొనుగోలు టెండర్ జ్యుడీషియల్ ప్రివ్యూకు వెళ్లందని అధికారులు సీఎంకు తెలిపారు. వీటిని నిర్దేశించుకున్న సమయంలోగా నాడు – నేడు పూర్తి చేసుకున్న స్కూళ్లకు అందించాలన్నారు. వచ్చే విద్యాసంవత్సరంలోగా ఐఎఫ్‌పీ ప్యానెళ్లు అందించాలని సీఎం ఆదేశించారు. నాడు – నేడు పూర్తవుతున్న కొద్దీ ఆ స్కూళ్లలో ఐఎఫ్‌పీలు ఏర్పాటు ఉండాలన్నారు.
పాఠ్యపుస్తకాల్లో అంశాలు, ట్యాబుల్లోని బైజూస్ కంటెంట్, ఐఎఫ్‌పీ కంటెంట్ ఇవన్నీ పూర్తి సినర్జీతో ఉండాలన్నారు. ప్రపంచస్థాయి పోటీని తట్టుకునేందుకు వీలుగా విద్యార్థులు ఇంగ్లిషులో పట్టు పెంచుకునేందుకు వారికి చేదోడుగా నిలవాలన్నారు. ఈ క్రమంగా ఇంగ్లిషు మాట్లాడటం, రాయడంలో వారు మెరుగైన ప్రావీణ్యం సాధించాలన్నారు. టోఫెల్, కేంబ్రిడ్జి లాంటి సంస్థల భాగస్వామ్యాన్నీ తీసుకోవాలన్నారు. వీరి సహాయంతో 3వ తరగతి నుంచీ పరీక్షలు నిర్వహించి పిల్లలకు సర్టిఫికెట్లు జారీచేసేలా కార్యక్రమాలను రూపొందించాలని సీఎం ఆదేశించారు. టీచర్లకూ ఇంగ్లిషుపై శిక్షణ కార్యక్రమాలు కొనసాగించాలని ఆదేశించారు. విద్యార్థులు ట్యాబులను వినియోగిస్తున్న తీరును సీఎంకు అధికారులు వివరించారు. ట్యాబుల వినియోగంలో వైయస్సార్ కడప, విజయనగరం, చిత్తూరు జిల్లాల విద్యార్థుల మొదటి మూడు స్థానాల్లో ఉన్నారన్నారు.
జగనన్న విద్యాకానుకపైనా సీఎం సమీక్షించారు. మార్చిలో మొదలు పెట్టి ఏప్రిల్ చివరినాటికి విద్యాకానుక వస్తువులన్నింటినీ స్కూళ్లకు చేరుస్తామన్నారు. స్కూళ్లు తెరిచే నాటికి పిల్లలకు విద్యాకానుక కిట్ అందిస్తామని అధికారులు తెలిపారు. మొదటి దశ నాడు–నేడుపై ఆడిట్‌పై సీఎం ఆరా తీయగా... ఆడిట్ పూర్తయ్యిందని అధికారులు తెలిపారు.మౌలికసదుపాయాల్లో ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే వాటిని సరిదిద్దాలని సీఎం ఆదేశించారు.
ఇవీ చదవండి: