Bheemla nayak: రాష్ట్రంలో భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంగా ప్రభుత్వ నిబంధనల అమలుపై జిల్లాల్లో అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు. గురువారం నుంచే రెవెన్యూ సిబ్బంది ద్వారా థియేటర్లపై నిఘా పెంచారు. థియేటర్ల యజమానులతో సమావేశమై నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతుల్లేవని, అదనపు కుర్చీలు వేసినా సీజ్ చేస్తామని హెచ్చరించారు. బెనిఫిట్ షోలు లేకపోవడంపై పవన్‌కల్యాణ్ అభిమానులు తిరుపతిలోని గాంధీ విగ్రహంవద్ద ఆందోళన చేపట్టారు. శ్రీకాళహస్తిలో తహసీల్దారుకు వినతిపత్రాన్ని అందజేశారు. కడపజిల్లా ప్రొద్టుటూరులో పాదయాత్ర చేశారు. విజయవాడ, తూర్పుగోదావరి జిల్లా రాజోలులో నిరసన తెలిపారు. థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు వచ్చే నష్టాల నుంచి వారిని ఆదుకోవడానికి గుంటూరు జిల్లా మాచర్లలో విరాళాల సేకరణకు హుండీ ఏర్పాటు చేశారు. మరోవైపు... వైకాపా నాయకులు థియేటర్ల నుంచి ముందుగానే టికెట్లు కొనుగోలు చేసి తమకు అందకుండా చేస్తున్నారని పవన్ కళ్యాణ్ అభిమానులు పలుచోట్ల విచారం వ్యక్తంచేశారు. యానాంలో సినిమా విడుదలవుతున్న రెండు థియేటర్లలో ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతిస్తూ సబ్ డివిజినల్ మేజిస్టేట్ అమన్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
శ్రీకాకుళం కలెక్టర్ శ్రీకేష్ బీ లఠ్కర్ గురువారం తహసీల్దార్లు, ఆర్డీవోలతో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించి, అధిక రేట్లకు టికెట్లు విక్రయించకుండా చూడాలని ఆదేశించారు. థియేటర్ల వద్ద నిబంధనల అమలు బాధ్యతను విశాఖలో తహసీల్దార్లకు అప్పగించారు. విజయనగరం జేసీ, ఒంగోలు ఆర్డీవో టికెట్ల ధరలు పెంచితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కృష్ణా జిల్లా జేసీ మాధవీలత బెనిఫిట్ షోలు వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గుంటూరు జిల్లాలోని పలు థియేటర్లలో తనిఖీలు కొనసాగాయి. నెల్లూరు జేసీ 5 డివిజన్ల పరిధిలోని ఆర్డీవోలు, థియేటర్ల యజమానులతో సమావేశం నిర్వహించారు. కడప, పశ్చిమగోదావరి జిల్లాల్లో థియేటర్ల వద్ద వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నిఘా పెట్టారు. విశాఖజిల్లా ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డులోని లక్ష్మీనరసింహ, ధర్మవరం బాలత్రిపురసుందరి సినిమా థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేస్తున్నట్లు యాజమాన్యాలు గురువారం రాత్రి ప్రకటించాయి.
ఏపీలో థియేటర్ల యాజమాన్యాల్ని బెదిరిస్తున్నారు..
సినిమా టికెట్ల ధరల జీవో-35ను హైకోర్టు రద్దు చేసినా... దాని ప్రకారమే టికెట్లను విక్రయించాలంటూ ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ అధికారులు థియేటర్ల యాజమాన్యాలను బెదిరిస్తున్నారని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఆరోపించింది. ఈ చర్య కోర్టు ఆదేశాల్ని ధిక్కరించడమేనని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవరించడం సరికాదని నిర్మాతల మండలి నాయకులు సూచించారు. గురువారం హైదరాబాద్‌లోని చలన చిత్ర వాణిజ్య మండలిలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ‘‘కొత్త జీవో విడుదల చేసేవరకు జీవో 35 ప్రకారం కాకుండా, ఒకప్పుడు వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన జీవో 100 అమలు చేస్తూ, ఆ ప్రకారమే టికెట్ ధరల్ని నిర్ణయించాలి. ఈ విషయంపై ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి’’ అని కోరారు. నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ... ‘‘శుక్రవారం భీమ్లానాయక్ సినిమా విడులదవుతుండడంతో బుధవారం సాయంత్రం నుంచే థియేటర్ యాజమాన్యాలపై ఒత్తిడి పెరిగింది. జీవో 35 ప్రకారం టికెట్లు అమ్మకపోతే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ఇది కోర్టు ఆదేశాల్ని ధిక్కరించడమే. దీనిపై ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. సమావేశంలో నిర్మాతల మండలి నాయకులు ఏలూరు సురేందర్‌రెడ్డి, మోహన్ వడ్లపట్ల తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'భీమ్లానాయక్' రిలీజ్.. కళాశాలకు హాలీడే.. స్పందించిన ఏపీ ప్రభుత్వ విభాగం