AP Agriculture Sector in Risk: వైఎస్సార్సీపీ పాలనలో విత్తన దశ నుంచే విపత్తు ముంచుకొస్తోంది. చీడపీడల ఉద్ధృతితో విచ్చలవిడిగా రసాయన మందుల వినియోగించాల్సి వస్తోంది. మూల రసాయన పిచికారి 2వేల టన్నులకు పైగా చేరుకుంది. దేశవ్యాప్తంగా రసాయన పురుగుమందుల వినియోగం తగ్గుతుంటే రాష్ట్రంలో భారీగా పెరుగుతోంది. రసాయన మందుల నాణ్యత పరీక్షల్లోనూ మమ అనిపిస్తున్నారు. ఫలితాలు వచ్చే సరికే రైతుల జేబులు ఖాళీ అవుతున్నాయి.
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం అని రైతు భరోసా కేంద్రాల వేదికగా రైతన్నలకు అండగా నిలుస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ తరచూ బాకాలూదుతుంటారు. కానీ, ఆ మార్పులు మాటలకే పరిమితమయ్యాయని క్షేత్రస్థాయి పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి.
నాణ్యతలేని పురుగు మందులు వ్యవసాయ క్షేత్రాల్ని ముంచెత్తుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో తెగుళ్ల నివారణకు పురుగుమందుల పిచికారీ ఖర్చు పెరిగి సాగు భారం రెట్టింపవుతోంది. పైగా ఈ రసాయనాల పురుగుమందులు నాణ్యత లేకపోయినప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.
5కిలోల 'బాహుబలి' నిమ్మకాయలను పండిస్తున్న రైతు- ఎక్కడంటే?
దేశవ్యాప్తంగా రసాయన మందుల వాడకం తగ్గుతుంటే రాష్ట్రంలో మాత్రం టన్నుల కొద్దీ పొలాల్లో పోయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. 2019-20తో పోలిస్తే రసాయన మందుల వాడకం 2022-23కి 28శాతం పెరిగింది. అంతేకాకుండా 2వేల టన్నుల మూల రసాయనాలను పిచికారి చేశారు. నాలుగేళ్లలో మూల రసాయన వాడకం 442 టన్నులు పెరిగింది.
బయో ఉత్పత్తుల వినియోగం 10 టన్నుల నుంచి ఏకంగా 51 టన్నులకు చేరింది. ఈ ఉత్పత్తుల పేరుతో రైతుల నుంచి దోపిడీ కూడా భారీగానే ఉంటోంది. అనంతపురం జిల్లాలో ఇటీవల విచ్చలవిడి బయో ఉత్పత్తుల అమ్మకాలపై ఆ శాఖ ఉన్నతాధికారులే ఆగ్రహం వ్యక్తం చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
'ఇదేంది సిద్ధారెడ్డీ?' సాగు భూములు ఇళ్ల పట్టాలుగా మార్చి పంపిణీ - అడ్డుకున్న బాధిత రైతులు
రసాయన మందుల నమూనాల సేకరణ కూడా మొక్కుబడిగానే సాగుతోంది. లక్ష్యంలో 70శాతం కూడా తీయడం లేదు. ఖరీఫ్‌లో 10 వేల 500 పురుగుమందుల నమూనాల్లో 5వేల లోపే సేకరించారు. ఫలితాలు వచ్చినవి కూడా 3వేల 200 మాత్రమే. అందులో సుమారు 40 వరకు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని నిర్ధరించారు.
ఏదైనా ఒక ఉత్పత్తి నాణ్యత లేదని గుర్తించే లోపే మార్కెట్లో వాటికి సంబంధించిన బ్యాచ్ నంబర్ల అమ్మకాలు పూర్తవుతున్నాయి. ఉమ్మడి కర్నూలు, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో పెద్దఎత్తున నాణ్యత లేని పురుగుమందుల్ని పట్టుకున్నారు. అయినా చర్యలు మాత్రం శూన్యమే. 213 కోట్లతో వ్యవసాయ ల్యాబ్‌లంటూ ఆర్భాటం చేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, అక్కడా వెంటనే పరీక్షలు చేసే విధానం అందుబాటులోకి తీసుకురాలేదు.
అనంతపురం జిల్లాలో టీడీపీ శ్రేణుల ఆందోళనలు - తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్
నాసిరకం రసాయన మందుల్ని గుర్తించినా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఇందుకు రాజకీయ ఒత్తిళ్లే కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2021-22 నుంచి 2023-24 వరకు పరిశీలిస్తే, 175 మిస్‌బ్రాండెడ్ ఉత్పత్తుల్ని గుర్తించారు. ఇందులో ఈ ఏడాది గుర్తించినవే 40వరకు ఉన్నాయి.
నాసిరకంగా గుర్తించిన ఉత్పత్తుల్లో 153 నమూనాలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చని గుర్తించారు. అయితే 31 ఉత్పత్తులపైనే చర్యలు తీసుకున్నారు. అంటే 80శాతం నాసిరకం ఉత్పత్తులపై చూసీ చూడనట్లు వదిలేశారు. ఏటికేడు చీడపీడల తీవ్రత అధికమవుతున్నా జగన్ ప్రభుత్వం నివారణ చర్యలపైనా దృష్టి పెట్టడం లేదు. కనీసం నాణ్యమైన రసాయన మందుల్ని అందించాలనే ధ్యాస కూడా లేకపోయింది.