Dharna of Anganwadi Workers across the State: సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తలు కదంతొక్కారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు, కనీస వేతనం 26 వేలకు పెంపు సహా తనిఖీల పేరుతో వేధింపులు ఆపాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని.. కలెక్టరేట్‌ల వద్ద నిరసనతో హోరెత్తించారు. అదే విధంగా YSR సంపూర్ణ పోషణ యోజనకు మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ఫేస్‌యాప్ రద్దు చేయాలని.. విశ్రాంత ప్రయోజనం కింద 5 లక్షలు ఇవ్వాలని, సూపర్ వైజర్ పోస్టులకు వయోపరిమితి తొలగించాలని కోరారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన అనేక హామీలకు మోక్షం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే అసెంబ్లీ ముట్టడికైనా వెనకాడబోమని తేల్చిచెప్పారు.
ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు.. రాష్ట్రంలో నిరసనలతో హోరెత్తించారు. గుంటూరు, బాపట్ల కలెక్టరేట్‌ల వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. కనీస వేతనం 26 వేలకు పెంచడంతో పాటు ఫేస్‌యాప్ రద్దు చేయాలని, వైఎస్సార్ సంపూర్ణ పోషణ యోజనకు మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, విశ్రాంత ప్రయోజనం కింద 5 లక్షలు ఇవ్వాలని, సూపర్ వైజర్ పోస్టులకు వయోపరిమితి తొలగించాలని కోరారు.
పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి: బాపట్ల కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం ధర్నా చౌక్‌లో ఆందోళన నిర్వహించారు. విజయవాడలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. అధికారులు ఇష్టారీతిన తనిఖీలు చేస్తూ తమను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏలూరు కలెక్టరేట్ ముట్టడికి అంగన్వాడీ టీచర్లు, కార్మికులు పెద్దఎత్తున తరలివచ్చారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను జగన్ నిలబెట్టుకోవాలని.. ధర్నాలో పాల్గొన్న పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ డిమాండ్ చేశారు
ఉత్తరాంధ్రవ్యాప్తంగా అంగన్‌వాడీలు నిరసనలతో కదంతొక్కారు. విశాఖ జీవీఎమ్సీ గాంధీ బొమ్మ వద్ద ఆందోళన చేపట్టిన కార్మికులు.. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకూ పోరాడతామని చెప్పారు. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో ధర్నా చేశారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ల వద్ద మహిళలు నినాదాలతో హోరెత్తించారు. దీర్ఘకాలంగా ఉన్న తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని.. లేకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. శ్రీకాకుళంలో కలెక్టరేట్ వరకు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు.
పాట రూపంలో సమస్యలు: బాలింతలు, గర్భిణీలు, పిల్లలకు సేవ చేస్తున్న అంగన్వాడీలు.. కనీసం ఇంటి అద్దె చెల్లించలేని దుస్థితిలో ఉన్నారని కడపలో నిర్వహించిన ఆందోళనలో మహిళలు వాపోయారు. పెద్ద ఎత్తున మహిళలు కర్నూలు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. హక్కుల కోసం పోరాడుతున్న తమను ప్రభుత్వం ఆంక్షల పేరుతో వేధిస్తోందని.. అనంతపురంలో అంగన్‌వాడీలు మండిపడ్డారు. ఇలానే ప్రవర్తిస్తే తగిన బుద్ధిచెబుతామని హెచ్చరించారు. నెల్లూరు వీఆర్సీ సెంటర్ నుంచి భారీ ప్రదర్శనగా తరలివెళ్లిన మహిళలు కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరసనలో ఓ మహిళ సమస్యలను పాటరూపంలో వ్యక్తంచేశారు.
ఇవీ చదవండి: