Six New mandals in AP: గత కొంత కాలంగా ఆయా ప్రాంతాల ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న కొత్త మండలాలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అందుకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా జిల్లాల్లోని కొత్తగా ఏర్పాటైన మండలాల వివరాలు తెలుపుతూ ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం.. ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా చెప్పాలని పేర్కొంది.
రాష్ట్రంలో కొత్తగా ఆరు మండలాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్రప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం ఆరు జిల్లాల్లోని జిల్లా కేంద్రం ఉన్న మండలాలను రెండేసి మండలాలుగా విభజిస్తూ రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. విజయనగరం, చిత్తూరు, నంద్యాల, అనంతపురం, ఒంగోలులను అర్బన్ , రూరల్ మండలాలుగా విభజిస్తూ ఈ నోటిఫికేషన్ను విడుదల చేశారు. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం మండలాన్ని మచిలీపట్నం సౌత్, నార్త్ మండలాలుగా విడదీస్తూ ఆదేశాలు ఇచ్చారు.
మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1-19, 40 వార్డులు సహా 18 గ్రామాలను మచిలీపట్నం నార్త్ మండలంగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. బందరు రూరల్ గ్రామం సహా 12 గ్రామాలు, మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 20-39 వార్డులను మచిలీపట్నం సౌత్ మండలంగా నిర్ధారిస్తూ రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. మండలాల విభజనకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్లో ఏవైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని ప్రభుత్వం పేర్కొంది. నోటిఫికేషన్లోని అభ్యంతరాలను, సలహాలు, సూచనల్ని 30 రోజుల్లోగా స్థానిక జిల్లా కలెక్టర్కు తెలియచేయాల్సిందిగా ప్రభుత్వం స్ఫష్టం చేసింది.
ఇవీ చదవండి: