AP rank in Social Progress Index report: సామాజిక పురోగతి సూచీలో, దేశంలో... ఆంధ్రప్రదేశ్ 23వ స్థానంలో ఉంది. దక్షిణాదినే ఉన్న పుదుచ్చేరి అగ్రస్థానాన్ని సాధించింది. గోవా, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కూడా ముందువరుసలో ఉన్నాయి. రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన చూస్తే, కడప, చిత్తూరు జిల్లాలు అగ్రస్థానంలో నిలిచాయి. 2022 సంవత్సరానికి దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, 707 జిల్లాల సామాజిక పురోగతికి సంబంధించి ‘సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్’ నివేదికను ఇటీవల ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి విడుదల చేసింది.
అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే.. భారత్ తొమ్మిదో స్థానంలో నిలిచి, 60.19వ ర్యాంకు సాధించింది. మానవ ప్రాథమిక అవసరాలు, ఆరోగ్యకర జీవనానికి పునాది, అవకాశాల ప్రాతిపదికన పోషకాహారం, కనీస వైద్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, వసతి, వ్యక్తిగత రక్షణ తదితర అంశాల కొలమానంతో ఐదు విభాగాలుగా వర్గీకరించి ఈ నివేదిక రూపొందించారు. సెకండరీ విద్యలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ వెనకబడింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహనిర్మాణంలోనూ రాష్ట్రం వెనుకంజే. దక్షిణాదిలో మరే రాష్ట్రంలోనూ ఈ పరిస్థితి లేదు.
ఇవీ చదవండి